ఆయ‌నకు కీల‌క ప‌ద‌విపై టీడీపీ న్యాయ పోరాటం!

టీటీడీ స‌భ్యుడిగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నిందితుడైన పెన‌క శ‌ర‌త్‌చంద్రారెడ్డికి ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ యాక్ట్‌కు వ్య‌తిరేకంగా నేర చ‌రితుడిని నియ‌మించ‌డాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ న్యాయ పోరాటానికి స‌మాయ‌త్తం…

టీటీడీ స‌భ్యుడిగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నిందితుడైన పెన‌క శ‌ర‌త్‌చంద్రారెడ్డికి ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ యాక్ట్‌కు వ్య‌తిరేకంగా నేర చ‌రితుడిని నియ‌మించ‌డాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ న్యాయ పోరాటానికి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు తెలిసింది. ఈ మేర‌కు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో అరెస్ట‌య్ కావ‌డంతో పాటు అప్రూవ‌ర్‌గా మారిన అర‌బిందో గ్రూప్ డైరెక్ట‌ర్ పెన‌క శ‌ర‌త్‌చంద్రారెడ్డికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం క‌ల్పిస్తారనే విమ‌ర్శ‌లు ఇంటా, బ‌య‌టా వినిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అల్లుడికి స్వయాన అన్న కావ‌డంతోనే ఆయ‌న‌పై లిక్క‌ర్ కేసులున్నా ప‌ట్టించుకోకుండా ఇష్టానుసారం ప‌ద‌వి ఇచ్చార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ శ‌ర‌త్‌చంద్రారెడ్డి చేతిలో వుంది. ఈ ప‌ద‌వి చాల‌ద‌న్న‌ట్టు ప‌విత్ర ఆధ్యాత్మిక సంస్థ టీటీడీలో శ‌ర‌త్‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌డం ఏంట‌నే నిల‌దీత అన్ని వైపుల నుంచి ఎదుర‌వుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ తొంద‌ర‌పాటు నిర్ణ‌యాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకునేందుకు టీడీపీ ఉత్సాహం చూపుతోంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో అప్రూవ‌ర్‌గా కూడా మారడంతో నేరాన్ని అంగీక‌రించ‌డ‌మే అని, నేర‌స్తుల‌కు టీటీడీలో స్థానం లేద‌ని ఆ సంస్థ యాక్ట్ చెబుతోందంటూ టీడీపీ న్యాయ‌పోరాటానికి శ్రీ‌కారం చుట్టింది. దీంతో ఒక‌ట్రెండు రోజుల్లో శ‌ర‌త్ నియామ‌కాన్ని స‌వాల్ చేస్తూ ఒక‌ట్రెండు రోజుల్లో కోర్టులో దావా దాఖ‌లు చేయ‌నుంది.