వాడు మ‌హేష్‌బాబు, వాడి ప‌క్క‌నోడు ప్ర‌భాస్ అని…!

త‌న‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఘాటుగా స్పందించారు. అలాంటి నాయ‌కులు తాను తీసిన సినిమాల్లో క్యారెక్ట‌ర్ లాంటోళ్ల‌ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని…

త‌న‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఘాటుగా స్పందించారు. అలాంటి నాయ‌కులు తాను తీసిన సినిమాల్లో క్యారెక్ట‌ర్ లాంటోళ్ల‌ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సీరియ‌స్‌గా రియాక్ట్ కావ‌డానికి నేప‌థ్యం ఏంటో తెలుసుకుందాం.

గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీపై వైసీపీ అభ్య‌ర్థిగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు నిలిచి ఓడిపోయారు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో జ‌గ‌న్‌కు వ‌ల్లభ‌నేని మ‌ద్ద‌తుగా నిలిచారు. దీన్ని వెంక‌ట్రావు జీర్ణించుకోలేకున్నారు. ఈ నేప‌థ్యంలో వంశీపై యార్ల‌గ‌డ్డ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

“గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఒక విలన్‌పై పోటీ చేశాను. వైసీపీ అధిష్ఠానం గన్నవరం సీటు ఎవరికి ఇస్తే వారు పోటీ చేస్తారు. అద్దెకొచ్చిన వారికి ఇస్తుందా లేక సొంత పార్టీలో ఉన్నవారికి ఇస్తుందా అనేది పార్టీ ఇష్టం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు మట్టి అక్రమాలపై నేను పోరాటం చేశాను. నేను గన్నవరం వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఒక తట్ట మట్టి కూడా తవ్వలేదు. పైసా అవినీతికి పాల్పడలేదు.  ఇప్పుడు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడేదెవరో ప్రభుత్వం విచారిస్తే తేలుతుంది” అని ప‌రోక్షంగా వ‌ల్ల‌భ‌నేని వంశీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

యార్ల‌గ‌డ్డ విమ‌ర్శ‌ల‌పై వంశీ ఓ రేంజ్‌లో చెల‌రేగిపోయారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే దుమ్ము దులిపారు. ఇవాళ వంశీ మీడియాతో మాట్లాడుతూ ఏమ‌న్నారంటే…

“ఇది జ‌గ‌న్ సొంత పార్టీ. న‌న్ను ప‌నిచేసుకెళ్లాల‌ని జ‌గ‌న్ చెప్పారు. కావాలంటే సీఎం నుంచి క్లారిటీ తీసుకోవ‌చ్చు. రోడ్డు మీద వెళుతుంటే ఇలాంటి వాళ్లు చాలా మంది త‌గులుతుంటారు. చాలా కామెంట్స్ చేస్తుంటారు. వాళ్లంద‌రితో నాకేం ప‌ని. నా ప‌ని నేను చేసుకుంటున్నా. న‌న్ను గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు ఎమ్మెల్యేగా గెలిపించారు. జ‌గ‌న్‌కు నేను మ‌ద్ద‌తు తెలిపాను. ఈ జ‌స్టిస్ చౌద‌ర్లు… పాట‌గాళ్లతో నాకు సంబంధం లేదు. వాళ్ల గురించి ఏదైనా వుంటే పార్టీ చూసుకుంటుంది. 

నా మీద ఏదైనా బాధ వుంటే జ‌గ‌న్ ద‌గ్గ‌ర చెప్పుకుంటారు. ఈ పిచ్చి కామెంట్లు వాళ్ల‌కు అన‌వ‌స‌రం. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఒక నాయ‌కుడు పిల‌వ‌క‌పోయినా భోజ‌నానికి వెళుతుంటాడు. ఇంకొకాయ‌న ప‌ర్మినెంట్ నాయ‌కుడు. కానీ ఎప్పుడూ ఏమీ చేయ‌డు. ఇంకో నాయ‌కుడు తాత్కాలిక నాయ‌కుడు. అప్పుడ‌ప్పుడు క‌న‌బ‌డుతుంటాడు. ఇంకొకడు అద్దె నాయ‌కుడు. ఎన్నిక‌ల‌ప్పుడు డ‌బ్బులిస్తే చాలు. వీళ్లంద‌రి గురించి నేనేం మాట్లాడాలి? 16 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నాను. గెలిచినా, ఓడినా గ‌న్న‌వ‌రంలో ఉన్నాను. 

పార్టీల‌కు అతీతంగా అడిగిన వాళ్లంద‌రికీ ప‌నులు చేస్తున్నా. నేను 15 సినిమాలు తీశాను. ఇలాంటి క్యారెక్ట‌ర్లు మా సినిమాల్లో చాలా మంది ఉన్నారు. ఊరు వ‌దిలి పారిపోయినోళ్లు, దేశం వ‌దిలి పారిపోయినోళ్లు. ఊరికే వ‌చ్చి హ‌డావుడి చేసి పారిపోయే వాళ్లు. గ‌న్న‌వ‌రంలో చాలా మందిని చూశాం. మీకు (విలేక‌రులు) ఎవ‌రో చెప్పారంటున్నారు క‌దా, వాడు పెద్ద మ‌హేష్‌బాబు అని, వాడి మొహం అద్భుత‌మైన రూప‌మ‌ని, వాడి ప‌క్క‌న ఇంకోక‌డు ప్ర‌భాస్‌. వాళ్లు మ‌ళ్లీ న‌న్ను అన‌డం” అని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  

ఇటీవ‌ల గ‌న్న‌వ‌రం పంచాయితీ వైసీపీ పెద్ద‌ల వ‌ద్ద జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ కొలిక్కి రాలేదు. ఇంత వ‌ర‌కూ వంశీని  వైసీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. వీరికి యార్ల‌గ‌డ్డ తోడ‌య్యారు. వీళ్ల‌పై వంశీ ప‌రోక్షంగా సెటైర్స్‌తో విరుచుకుప‌డడం చ‌ర్చ‌కు దారి తీసింది.