తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎదురు తిరగడమంటే ఇంకేమన్నా వుందా.? అయితే, అది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణలో కేసీఆర్ ఇమేజ్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. 'కేసీఆర్ ఖబడ్దార్..' అంటూ ఆర్టీసీకి సంబంధించిన సాధారణ కార్మికులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసినా ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గలేదు.. తెలంగాణ ప్రభుత్వమూ దిగి రాలేదు.!
హైకోర్టు అంటే ఆర్టీసీ కార్మికులకీ, ప్రభుత్వానికీ లెక్కలేకుండా పోయిందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఆర్టీసీ ఎండీని నియమించాల్సిన ప్రభుత్వం.. ఆ దిశగా ముందడుగు వేసినట్లు కన్పించడంలేదు. సమ్మె పక్కన పెట్టి చర్చలకు వెళ్ళండి.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అంటూ కార్మికులకి హైకోర్టు చేసిన సూచన కూడా పని చేయకపోవడం గమనార్హం. రేపు హైకోర్టులో ఈ అంశాలపై ఇరు పక్షాల తరఫున వాదనలు ఎలా వుంటాయి.? న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.. కార్మికుల డిమాండ్లకు తలొగ్గం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాం..' అని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచీ మద్దతు పెరుగుతోంది. మొత్తమ్మీద, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయన్నమాట.
అన్నట్టు, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ప్రభుత్వాన్ని ఆర్టీసీ సమ్మె విషయమై వివరణ కోరారు. ప్రభుత్వం తరఫున అధికారులు గవర్నర్‌కి వివరణ ఇచ్చుకున్నారు. సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించాలని ప్రభుత్వానికి గవర్నర్ విజ్ఞప్తి చేయడం కీలక పరిణామంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ నెల 21 నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవాల్సి వుంది. ఈలోగా సమస్యకు పరిష్కారం దొరక్కపోతే, మళ్ళీ సెలవుల పొడిగింపు వుంటుందా.? వుంటే, ఆ తర్వాత పరిణామాలు ఇంకెలా మారతాయి.? అన్నదీ చర్చనీయాంశమే.