విడాకులు తీసుకున్న మంచు మనోజ్

ఓ ముఖ్యమైన విషయాన్ని అందరితో పంచుకుంటానంటూ పొద్దున్నుంచి ఊరిస్తున్న మంచు మనోజ్, ఊహించినట్టుగానే పెద్ద బాంబ్ పేల్చాడు. భార్య ప్రణతి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు మనోజ్. 2015లో మనోజ్, ప్రణతికి పెళ్లయింది.…

ఓ ముఖ్యమైన విషయాన్ని అందరితో పంచుకుంటానంటూ పొద్దున్నుంచి ఊరిస్తున్న మంచు మనోజ్, ఊహించినట్టుగానే పెద్ద బాంబ్ పేల్చాడు. భార్య ప్రణతి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు మనోజ్. 2015లో మనోజ్, ప్రణతికి పెళ్లయింది. కానీ కొన్నాళ్లుగా వాళ్ల మధ్య అభిప్రాయబేధాలు ఎక్కువయ్యాయి. విడాకులకు దారితీయడానికి అవే కారణం అంటున్నాడు మంచు మనోజ్.

“బరువెక్కిన మనసుతో ఈ విషయాన్ని చెబుతున్నాను. మేం విడాకులు తీసుకున్నాం. అధికారికంగా విడిపోయాం. మామధ్య అభిప్రాయబేధాలున్నాయి. చాలా బాధ అనుభవించాం. ఎంతో ఆలోచించిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. మా నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని, మద్దతిస్తారని ఆశిస్తున్నాను.”

ఇలా తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు మంచు మనోజ్. ఇన్నాళ్లూ సినిమాలు చేయకపోవడానికి ఇదే కారణమని ప్రకటించిన మనోజ్.. ఇకపై సినిమాలే లోకంగా జీవిస్తానని, ఫ్యాన్స్ ను ఎప్పట్లానే అలరిస్తానని ప్రకటించుకున్నాడు.

“నా మనసు నాలో లేదు. అందుకే ఇన్నాళ్లూ నేను నటించలేకపోయాను. ఇన్నాళ్లూ నా పనిపై దృష్టిపెట్టలేకపోయాను. ఇలాంటి సమయాల్లో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రత్యేకంగా నా అభిమానులకు కృతజ్ఞతలు. నాకు తెలిసిన ఒకే ఒక్క పని సినిమా. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను.”

కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు మనోజ్. ఆయన నటించిన ఆఖరి చిత్రం ఒక్కడు మిగిలాడు. ఆ ఫ్లాప్ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. వరుసగా ఫ్లాపులు రావడంతోనే మంచు మనోజ్ గ్యాప్ తీసుకున్నాడని అంతా భావించారు. కానీ ఇలా వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమయ్యాడనే విషయం చాలామందికి తెలియదు. 

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్