ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఇక నుంచి ప్రతియేటా ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేయబోతున్నట్టుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతియేటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ మేరకు నిరుద్యోగులు ప్రిపరేషన్ మొదలుపెట్టుకోవచ్చు.
ఆ సంగతలా ఉంటే.. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ప్రక్రియను రద్దుచేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకూ ఇంటర్వ్యూల ప్రక్రియ అత్యంత కీలకంగా నిలిచింది. అలాగే అది అనుమానాలకు కూడా తావిచ్చింది.
ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసే బోర్డు ఉద్యోగాలను అమ్ముకుంటుందనే అనుమానాలను పుట్టించింది. మార్కులు తెచ్చుకోవడమే గాక ఇంటర్వ్యూ బోర్లులోని వ్యక్తులను మెప్పించడం అంటే మాటలు కాదు. ఈ నేపథ్యంలో అనేకమంది ఉద్యోగార్థులు ఇంటర్వ్యూ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి నేపథ్యంలో ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఉద్యోగం కావాలనుకునే వాళ్లు ప్రిలిమ్స్, మెయిన్స్ లలో రాత పరీక్షలో సత్తాచూపిస్తే చాలు! అనే భరోసాను ఇస్తున్నారు.