మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్లో గెలుపొందిన వాళ్లు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలుపోందిన వారి మూకుమ్మడి రాజీనామాలపై విష్ణు తనదైన శైలిలో స్పందించారు. అలాగే ఇకపై తానెలా వ్యవహరించనున్నారో స్పష్టం చేశారు.
‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతిదీ అమలు జరిగేలా చూస్తానన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ విజేతల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ వారి కారణాలు వారికి ఉండొచ్చన్నారు.. అది చాలా దురదృష్ట కరమన్నారు. కానీ మా అభివృద్ధి కోసం ప్రత్యర్థి ప్యానల్ సభ్యుల్ని కూడా కలుపుకునిపోతామని విష్ణు అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై వారి సలహా తీసుకుంటానన్నారు.
వారి సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నట్టు విష్ణు చెప్పుకొచ్చారు. అలాగే ఇకపై ‘మా’ ఎన్నికలకు సంబంధించి తాను , తన టీం సభ్యులు మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. ఇకపై కేవలం అభివృద్ధి సంగతుల గురించి మాత్రమే మాట్లాడ్తామని విష్ణు స్పష్టం చేశారు.