హెచ్చ‌రించినా జ‌గ‌న్‌లో చ‌ల‌నం లేదు

ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎలా పెంచాల‌ని ఆలోచిస్తున్న టీడీపీకి వ‌జ్రాయుధం లాంటిది దొరికింది. అది విద్యుత్ కోత‌ల రూపంలో దొరికింద‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డుతోంది. బొగ్గు కొర‌త‌తో దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయిన సంగ‌తి…

ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎలా పెంచాల‌ని ఆలోచిస్తున్న టీడీపీకి వ‌జ్రాయుధం లాంటిది దొరికింది. అది విద్యుత్ కోత‌ల రూపంలో దొరికింద‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డుతోంది. బొగ్గు కొర‌త‌తో దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయిన సంగ‌తి తెలిసిందే. 

ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అతీత‌మేమీ కాదు. కానీ దేశ వ్యాప్తంగా విద్యుత్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఊద‌ర‌గొడుతోంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ట్విట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. వ్యంగ్యం జోడించి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరో వైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సీఎం జగన్‌లో చలనం లేదు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం దారుణం. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది’ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.

మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని నారా లోకేశ్ వెట‌కారం చేయ‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ ట్వీట్‌పై ప్ర‌త్య‌ర్థుల రియాక్ష‌న్ ఏంటో మ‌రి?