మంచు విష్ణు స్వీట్ వార్నింగ్

“సినిమా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది” అంటూ గతంలో ప్రకాష్ రాజ్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ డైలాగ్ కొట్టారు. దానికి…

“సినిమా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది” అంటూ గతంలో ప్రకాష్ రాజ్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ డైలాగ్ కొట్టారు. దానికి తగ్గట్టే ఎన్నికల కమిషన్ ను సీసీటీవీ ఫుటేజ్ అడగడం, ప్యానెల్ లో గెలిచిన ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే కోర్టుకెక్కుతారనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ, మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఎవ్వరూ స్పందించలేదు. మరీ ముఖ్యంగా మంచు విష్ణు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దల్ని కలవడంలో, 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంలో బిజీ అయ్యాడు. ఈరోజు అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ కామెంట్లపై స్పందించాడు.

“కొంతమంది రాజీనామాలు చేశారు. అది దురదృష్టకరం. మీరు రిజైన్ చేసినందుకు సారీ చెబుతున్నాను. కానీ షో మాత్రం ఆగదు. సినిమా నడుస్తుంది. మేం ముందుకెళ్తాం. 'మా' ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా బ్రహ్మాండంగా నడుస్తుంది.”

ఇలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మంచు విష్ణు. ఇకపై తనతో పాటు, తన ప్యానెల్ సభ్యులెవ్వరూ మీడియా ముందుకు రారని స్పష్టంచేసిన మంచు విష్ణు.. అసోసియేషన్ లో ఏం చేస్తున్నామనే విషయాల్ని మాత్రం మీడియాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నాడు.