ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి, యువ కాంగ్రెస్ నేత జీవీరెడ్డి టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 21న టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ పార్టీలో ఐదేళ్లుగా కొనసాగుతూ బలమైన గొంతుక వినిపిస్తున్నారు.
రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై జీవీరెడ్డికి లోతైన అవగాహన ఉంది. టీవీ డిబేట్లలో తరచూ పాల్గొంటూ పాలకులను నిలదీస్తూ గుర్తింపు పొందారు.
ప్రకాశం జిల్లాకు చెందిన జీవీరెడ్డి హైదరాబాద్లో స్థిరపడ్డారు. సీఏతో పాటు న్యాయవిద్యలో కూడా పట్టా పుచ్చుకున్న జీవీరెడ్డి ఆర్థిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ఎప్పటికప్పుడు ధైర్యంగా బయటపెడుతూ టీడీపీ పెద్దల దృష్టిలో పెట్టారు.
40 ఏళ్లలోపు వయసున్న జీ.వెంకటరెడ్డికి రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉందని, తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఏపీలో భవిష్యత్ లేని కాంగ్రెస్లో ఉండడం కంటే టీడీపీలో చేరడమే సముచి తమని జీవీరెడ్డి భావించినట్టు తెలిసింది.
ఇటీవల ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్న ప్రచారం నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరి కొందరు నాయకులు కూడా జీవీరెడ్డి బాటలో నడిచే అవకాశాలున్నాయి.