“మా” నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార వేదిక మెగా ఫ్యామిలీపై విమర్శలకు వేదికగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ దిమ్మ తిరిగేలా విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రసంగం సాగింది. తాను రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తినంటూనే మెగా ఫ్యామిలీలపై తనదైన స్టైల్‌లో పంచ్ డైలాగ్‌లతో విరుచుకుపడ్డారు. మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలున్నామని విరవీగొద్దని పరోక్ష హెచ్చరిక చేశారు.
ఇవాళ “మా” నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు ప్రమాణీ స్వీకారం చేశారు. తాను శాంతికి ప్రతీక అన్న రేంజ్‌లో మోహన్‌బాబు ఉపన్యాసం ఇచ్చారు. మరోవైపు మెగా కుటుంబం బెదిరింపులకు పాల్పడిందని పరోక్షంగా ప్రస్తావించి అలాంటి వాటికి భయపడలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మెగా కుటుంబంపై మోహన్‌బాబు పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సాగించిన ప్రసంగం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోహన్‌బాబు ప్రసంగం ఎలా సాగిందంటే…
“విరవీగుతాం. ఏయ్ నేనెంత అని. గంధర్వులు అన్నీ చూస్తుంటారు. కనురెప్ప వేయరు. మరుక్షణమే దిమ్మ తిరిగేట్టు కొడతారు. ఇది తెలుసుకోకుండా మేము ఇంత మంది ఉన్నాం, అంతమంది ఉన్నాం అంటూ ఎంతో మందిని బెదిరించారిక్కడ. ఆ బెదిరింపులకు ఈ కళాకారులు భయపడరు. మా ఓటు మా ఇష్టం. క్యారెక్టర్ లేకపోతే అవకాశం ఇవ్వరు కదా. ఒకరి దయాదాక్షిణ్యాలు ఇండస్ట్రీలో ఉండవు. కేవలం ప్రతిభే నిలుపుతుంది.
క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్‌ను అభివృద్ధి చేసుకుంటే సినిమా అవకాశాలు ఎందుకు ఉండవో చూద్దాం. అది గుర్తు పెట్టుకుని ఎవరికీ భయపడకుండా మా ఓటు మా సొంతమని ఎవరికీ భయపడకుండా మీరు నా బిడ్డను గెలిపించారంటే ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ, రాగద్వేషాలు లేవు. అ అవసరం లేదు. వయసు పైబడుతోంది. ఎప్పుడూ లేవు పగరాగద్వేషాలు. మంత్రి శ్రీనివాస్‌యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించింది” అని చెప్పుకొచ్చారు.
ప్రకాశ్‌రాజ్‌ను ఏకగ్రీవం చేసుకుందామని, విష్ణును బరిలో నుంచి తప్పుకోవాలని మెగాస్టార్ చిరంజీవి తనను కోరినట్టు ఓ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా నిర్ధారించారు. టాలీవుడ్‌లో అత్యధికంగా మెగాస్టార్ కుటుంబ సభ్యులు హీరోలుగా, నిర్మాతలుగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను తాము బలపరుస్తున్నామని, మద్దతు పలకాలని నాగబాబు కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ మద్దతు పలకకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కవని మెగా కుటుంబ సభ్యులు హెచ్చరించారని మోహన్‌బాబు తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావించారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు ఇదే ప్రసంగంలో కళాకారుల్లారా అందరూ ఒకటిగా ఉండాలని పెదరాయుడు మాదిరిగా కోరిన మోహన్‌బాబు, మరోవైపు అగ్రహీరో కుటుంబంపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. పగ, రాగద్వేషాలు లేవే లేవని చెప్పిన పెద్ద మనిషి మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మోహన్‌బాబు డైలాగ్‌లకు అర్థాలే వేరులే అని మరికొందరు సెటైర్స్ విసురుతున్నారు.