బాబుది పేరుకే జాతీయ పార్టీ ….కేసీఆర్ ది అంతేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. మీడియా కూడా టీడీపీని జాతీయ పార్టీగా వ్యవహరిస్తూ ఉంటుంది. పత్రికల్లో టీడీపీ అధినేత బాబును టీడీపీ జాతీయ…

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. మీడియా కూడా టీడీపీని జాతీయ పార్టీగా వ్యవహరిస్తూ ఉంటుంది. పత్రికల్లో టీడీపీ అధినేత బాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడు అని, నారా లోకేష్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని, అధికార ప్రతినిధులను జాతీయ అధికార ప్రతినిధులు అని రాస్తుంటారు. ఆ పార్టీ వారు చెబుతున్నట్లు, మీడియా చెబుతున్నట్లు టీడీపీ నిజంగానే జాతీయ పార్టీయా ?

నిబంధనల ప్రకారం టీడీపీకి జాతీయ పార్టీగా అధికారికంగా గుర్తింపు లేనేలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే నిర్దిష్ట రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తెచ్చుకోవాలి. టీడీపీకి అంత సీన్ లేదు. పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే ఆ పార్టీకి దిక్కు మొక్కు లేదు. ఇక జాతీయ పార్టీ ఎలా అవుతుంది? ఇక కేసీఆర్ విషయానికొస్తే ఆయన తన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా అంటే బీఆర్ఎస్ పార్టీగా మార్చారు కదా. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో ధూమ్ ధామ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

దేశంలోని పేరుపొందిన ప్రాంతీయ పార్టీల నాయకులంతా వచ్చి ఆయన్ని ఆకాశానికి ఎత్తుతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన జాతీయ పార్టీ పెట్టింది బీజేపీని గద్దె దింపాలనే  లక్ష్యంతో కదా. కానీ జాతీయ కార్యాలయం ప్రారంభించినా మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ లేదు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి మినహా ఎవరు రాలేదు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా హాజరు కాలేదు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ముఖం కూడా చూపించలేదు.. మొత్తానికి ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి లాగా… హైదరాబాదు నుంచి వచ్చిన వాళ్లు తప్ప మిగతా వాళ్ళ జాడ కనిపించలేదు.

మొత్తంగా చెప్పాలంటే కేసీఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన పెద్దగా ప్రభావం చూపలేదు.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదిగేందుకు పేరు మార్చుకొని, అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటుచేసినా ఎందుకూ ఉపయోగం లేకుండా పోయింది? చండీయాగంతో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించినప్పటికీ… దేశ రాజధానిలో రాజకీయ వర్గాల మధ్య గానీ, మీడియాలో గానీ, విశ్లేషకుల మధ్య గానీ దీనిపై ఎటువంటి చర్చా జరగడం లేదు.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీ వచ్చిన కేసీఆర్… రోజులపాటు దేశ రాజధాని లోనే బస చేశారు.

పరిస్థితి తీవ్రతను గమనించారేమో కార్యకర్తల కోసం సర్వదర్శన ఏర్పాటు చేశారు. శనివారం కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు చెప్పినా అకస్మాత్తుగా కేసీఆర్ శుక్రవారం రాత్రే హైదరాబాద్ తిరిగి వచ్చారు. భారత రాష్ట్ర సమితి గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారమే హైదరాబాద్ కు వెళ్లిపోయారని ఢిల్లీలోని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.. అయితే పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసు రావడంతో హడావిడిగా ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్లారని మరో నేత వ్యాఖ్యానించారు.. కాగా కేసీఆర్ వెళ్లే ముందు తుగ్లక్ రోడ్డులోని తన నివాసం నుంచి భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. అయితే కార్యాలయం వద్ద  హైదరాబాదు నుంచి వచ్చిన పార్టీ నేతలే హడావిడి చేశారు.

కాంగ్రెసేతర పార్టీల మధ్య కూడా భారత రాష్ట్ర సమితి గురించి చర్చ జరగలేదు.. శరద్ పవార్  తో పాటు వివిధ పార్టీల నేతలు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఎవరూ రాలేదు. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తానంతట తాను తమిళనాడు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు తిరిగినా జేడీయూ, బి జె డి, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏర్పాటును విస్మరించడం గమనార్హం.. అఖిలేష్ యాదవ్, కుమార స్వామికి కేసిఆర్ ఆర్థిక సహాయం చేసినందుకే వారు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మేధావులు, ఎన్జీవోలు, శాస్త్రవేత్తలు కూడా ఎవరూ పెద్దగా రాలేదు. కేసీఆర్ ను తరచూ కలిసే ఎన్డి టీవీ మాజీ సీఈవో ప్రణయ్ రాయ్ కూడా కేసీఆర్ ని కలవలేదు.

అంతేకాదు భారత రాష్ట్ర సమితి అధినేత ఢిల్లీకి వచ్చి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తే ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ లో తమ పార్టీ పైకి నేతల దృష్టి మళ్లించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ నుంచి 200 మంది దాకా కార్యకర్తలను రప్పించుకుని, నినాదాలను ఇప్పించుకుని, వారికి కేసీఆర్ తో సర్వదర్శనం ఏర్పాటు చేయించడం మినహా జాతీయస్థాయిలో భారత రాష్ట్ర సమితి గురించి ప్రచారం కల్పించేందుకు నేతలు ఎవరు పెద్దగా ప్రయత్నించకపోవడం గమనార్హం..ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ స్థాపించినప్పుడు జరిగిన హడావిడిలో ఇప్పుడు 0.1 శాతం కూడా లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 

ఇక వచ్చేవారం కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇతర మేధావులతో భేటీ  ఉన్నందున ఆయన ఢిల్లీ వస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభమే ఇంత పేలవంగా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో.