ఇటీవలే టీడీపీ రాజ్యసభ సభ్యులను విలీనం చేసేసుకున్నారు. ఆపై ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల రాజీనామాలట! ఇంకా తమ పదవి కాలం ఉండగానే కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న కొందరు రాజీనామాలు చేస్తున్నారట! ఆ రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాలను బీజేపీ వాళ్లు ఆక్రమించే అవకాశాలున్నాయి. దీంతో రాజీనామాల పర్వం మొదలైంది. ఇది మరి కొన్ని రోజులు కొనసాగుతుందట.
మొత్తానికి ఈ సారికి శీతాకాల సమావేశాలు మొదలయ్యే సమయానికి మరింత మంది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారట. అలా కాంగ్రెస్ బలం పెద్దల సభలో కూడా తరిగిపోయి.. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా నిలుస్తుందనమాట!
అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా రాజ్యసభలో మాత్రం బీజేపీకి ఇంకా చేయి తిరగడం లేదు. అక్కడ పరిపూర్ణమైన మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల విలీనంతో బీజేపీ బలం కొంత పెరిగింది. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం.. నామినేటెడ్ ఎంపీలు పోనూ, 243మందిలో ఎన్డీయే వైపు 106 మంది ఎంపీలున్నారు.
అన్నాడీంఎకే 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలమే. పూర్తి మెజారిటీ సంపాదించుకోవాలంటే బీజేపీకి మరి కొంత సమయం పట్టేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు 45 మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు రాజీనామాలు చేస్తే.. మిగిలిన వారిలో మెజారిటీ బీజేపీ వైపుకు మొగ్గే అవకాశం ఉంది.