శాటిలైట్ రైట్స్ విషయంలో టీవీ ఛానెల్స్ గుంభనంగా వ్యవహరిస్తాయి. బడా సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏదైనా ఛానెల్ దక్కించుకుంటే అది లీకుల రూపంలోనే బయటకొస్తుంది తప్ప, సదరు చానెల్ ఆర్భాటంగా ప్రకటించుకోదు. కానీ జెమినీ టీవీ ఛానెల్ వ్యవహారం మాత్రం దీనికి కాస్త విరుద్ధంగా ఉంది. సినిమా ఏదైనా దాన్ని ఘనంగా ప్రకటించుకుంటోంది ఈ ఛానెల్. ఇక్కడివరకు ఓకే. కానీ అత్యుత్సాహానికి పోయి కొన్ని విషయాల్ని ముందుగానే ప్రకటించి ఫ్యాన్స్ తో చీవాట్లు తింటోంది ఈ ఛానెల్.
ఉదాహరణకు బాలయ్య సినిమానే తీసుకుందాం. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని చెప్పుకుంటే తప్పులేదు. అక్కడితో ఆగకుండా బాలయ్య సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టినట్టు ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాకు అనుకున్న టైటిల్స్ లో రూలర్ అనే టైటిల్ ముందు వరుసలో ఉంది. రేపోమాపో ఇదే టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అంతలోనే జెమినీ టీవీ ఆ పేరును బయటపెట్టడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఆ ట్వీట్ ను తొలిగించింది సదరు ఛానెల్.
ఇదొక్కటే కాదు, ఆమధ్య నాగచైతన్య సినిమా విషయంలో కూడా ఇలానే వ్యవహరించింది ఈ ఛానెల్. దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారనే విషయం మాత్రం సస్పెన్స్. ఈ విషయాన్ని గ్రాండ్ గా ప్రకటిద్దామని యూనిట్ భావిస్తుంటే.. జెమినీ టీవీ మాత్రం పుసుక్కున ప్రకటించేసి హైప్ ను నీరుగార్చేసింది.
ఈ రెండూ జస్ట్ ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అత్యుత్సాహం పనులు చాలా చేసింది ఈ ఛానెల్. సంక్రాంతి టైమ్ లో వినయ విధేయ రామ వచ్చినప్పుడు, మహేష్ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నప్పుడు కూడా ఇది ఇలానే అతిగా ప్రవర్తించి అభిమానుల ఆగ్రహానికి గురైంది.