Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవి ఎక్కే గడప.. దిగే గడప..!

చిరంజీవి ఎక్కే గడప.. దిగే గడప..!

మెగాస్టార్ కు ఏమైంది. 150 సినిమాలకు లేని ఆనవాయితీని 151 సినిమాకు కొత్తగా ఇప్పుడెందుకు స్టార్ట్ చేశారు. కనీసం 151 సినిమా ఫంక్షన్ కి ఏ రాజకీయ నేతనీ పిలవని చిరంజీవి, సినిమా విడుదలైన తర్వాత అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు. అది కూడా 2 వారాల తర్వాత. ఈ కలయికల వల్ల ఆయనకేంటి లాభం. అసలేం జరుగుతోంది..? తొలితరం స్వాతంత్ర సమరయోధుడి కథతో సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు చిరంజీవి, రామ్ చరణ్.

అయితే ఉయ్యాలవాడ చరిత్రపై చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి, కల్పితాలు జోడించి కమర్షియల్ హంగులతో కథని తెరకెక్కించారు. సినిమా బాగుందని ప్రశంసలొచ్చినా, చిరంజీవి నటన అద్భుతం అంటూ అభిమానులంటున్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా అనుకున్న స్థాయికి చేరుకోలేదు. ఇలాంటి సమయంలోనే చిరంజీవి రంగంలోకి దిగారు. గవర్నర్లను, ముఖ్యమంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని వరసబెట్టి కలుస్తూ తన సినిమాకి క్రేజ్ పెంచేందుకు కష్టపడుతున్నారు.

రిలీజ్ ముందు సైరాకు పొలిటికల్ టచ్ లేదు. సినిమాకు సంబంధించి ఏ ఫంక్షన్ కీ ఏ నాయకుడినీ పిలవలేదు, పవన్ కల్యాణ్ ను తప్ప. అది వేరే లెక్క. మరి రిలీజ్ తర్వాత చిరంజీవి రాజకీయ ప్రాపకం కోసం ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నారనే ప్రశ్నలు సగటు అభిమానుల్ని వేధిస్తున్నాయి. చిరంజీవి చేస్తున్న పని ఆయన ఇమేజ్ ని తగ్గిస్తోందని ఓ వర్గం వాదిస్తోంది. కేవలం సినిమాని కాపాడుకోవడం కోసం, రాయితీల కోసం, అవార్డుల కోసమైతే చిరంజీవి ఇంత ఇదిగా అందరి చుట్టూ తిరగాల్సిన పనిలేదని అంటున్నారు అభిమానులు.

ఆ మధ్య ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా బాలీవుడ్ లో విడుదలైంది. కంగనా రనౌత్ నటన అద్భుతం అన్నారందరూ, వివాదాలు చుట్టుముట్టినా తనే చివర్లో సినిమాకు దర్శకత్వం వహించి పని పూర్తి చేసింది కంగనా. ఈ సినిమా కోసం ఆమె కానీ, చిత్ర యూనిట్ కానీ ఎవరి దగ్గరకూ వెళ్లలేదు. సినిమా చూసిన రాజకీయ నాయకులే స్వచ్ఛందంగా ప్రశంసించారు. మరి సైరా కోసం చిరంజీవి తనే ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నారనేదే అర్థం కావడంలేదు.

పోనీ తన పొలిటికల్ స్టామినా ఎంతుందని చిరంజీవి ఒకసారి చెక్ చేసుకోదల్చుకున్నారా, తన పర్యటనల గురించి అభిమానుల స్పందనేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా, అందర్నీ కలసిన తర్వాత చిరంజీవి ఏదైనా సంచలన ప్రకటన చేయదలుచుకున్నారా తేలాల్సిఉంది. ప్రస్తుతానికైతే చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ అసాధ్యం. అయితే కేవలం సినిమా కోసమే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి అందర్నీ కలుస్తున్నారని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఇకపై టాలీవుడ్ లో ఏ వ్యవహారం వచ్చినా చిరంజీవి ముందుండి పరిష్కరించే అవకాశం ఉంది. రాజకీయ సంబంధమైన అవసరాలుంటే చిరంజీవే వాటిని స్వయంగా పొలిటికల్ వర్గాల దృష్టికి తీసుకెళ్తారు. సైరా సినిమా ముసుగులో ఇలా చిరంజీవి పొలిటికల్ టూర్ వేస్తున్నారు. మామూలు టైమ్ లో ఇలాంటి భేటీలన్నీ కాస్త కష్టం, అందుకే సినిమాని అడ్డం పెట్టుకుని అందర్నీ చుట్టేస్తున్నారు చిరంజీవి.

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?