పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ నిప్పు అంటుకుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి ఊపిరి పోసుకున్నాయి. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గంలో వర్గ రాజకీయాలు నిప్పు రాజేశాయి. దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ ఆజ్యం పోశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కోవడం చేతకాక, మరో ఫ్యాక్షన్ సంబంధిత వ్యక్తికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారనే విమర్శలు చెలరేగాయి.
టీడీపీ ఇన్చార్జ్గా జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించడం వెనుక చంద్రబాబు ఉద్దేశం స్పష్టమైంది. మాచర్ల నియోజకవర్గంలో 1980 దశకంలో ఏడు హత్యలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. ఈ హత్యల వెనుక ప్రధాన సూత్రధారి, పాత్రధారి జూలకంటి బ్రహ్మారెడ్డి అని మాచర్ల నియోజకవర్గంలో ఎవరినీ అడిగినా చెబుతారు. బ్రహ్మారెడ్డిని ఇన్చార్జ్గా నియమించడం ద్వారా వైసీపీని బయపెట్టే కుట్ర దాగి వుందనే టాక్ నడుస్తోంది.
అయితే వ్యక్తిగతంగా బ్రహ్మారెడ్డి మంచి వ్యక్తి అనే పేరు ఉన్నప్పటికీ, అతని ఫ్యాక్షన్ నేపథ్యం చూస్తే ఎవరైనా జంకుతారు. బ్రహ్మారెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం వుంది. 1972లో బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నాగిరెడ్డి భార్య దుర్గాంబ భర్త రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. 1999లో టీడీపీ తరపున జూలకంగి దుర్గాంబ మాచర్ల నుంచి గెలుపొందారు.
ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా బాగా కష్టాల్లో పడ్డారు. అప్పటి నుంచి రాజకీయాలపై విసిగిపోయి కుటుంబంతో సహా గుంటూరుకు మకాం మార్చారు. అక్కడే పిల్లల్ని చదివించుకుంటూ… ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు రాజకీయాల వాసనే లేకుండా ఆయన జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి నాయకత్వ కొరత ఏర్పడింది. 2012 ఉప ఎన్నికలో చిరుమామిళ్ల మధుబాబు, 2014లో కొమ్మారెడ్డి చలమారెడ్డి, 2019లో అన్నపురెడ్డి అంజిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేశారు.
అప్పుడెప్పుడూ ఈ తరహా మంటలు మాచర్లలో చెలరేగలేదు. ఎన్నికల సమయంలో తమకిష్టమైన వారికి ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లోనూ పిన్నెల్లి కుటుంబ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డే సరైన నాయకుడిగా చంద్రబాబు భావించారు. అలాంటి వ్యక్తిని టీడీపీ స్వార్థపూరిత రాజకీయాల కోసం మాచర్లకు తీసుకెళ్లారు.
మాచర్లకు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న బ్రహ్మారెడ్డిని బతిమలాడి మరీ టీడీపీ ఇన్చార్జ్గా చంద్రబాబు ప్రకటించారు. వైసీపీపై బ్రహ్మారెడ్డి కవ్వింపు చర్యలకు దిగడంతో చిచ్చు రేగింది. దాని పర్యవసానాలే నిన్నటి మాచర్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.