వైసీపీ ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేయాలో తెలియక, ఎలాంటి ఆరోపణలు గుప్పించాలో అర్థం కాక చంద్రబాబు, లోకేష్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు మంత్రి రోజా. పదో తరగతి పాస్ పర్సంటీజీపై రాద్దాంతం చేస్తూ.. తండ్రికొడుకులు మరింత దిగజారిపోయారని విమర్శించారు.
“సంక్షేమ పథకాలన్నీ సజావుగా అమలవుతుంటే ఏం చేయాలో చంద్రబాబు, లోకేష్ కు అర్థం కావడం లేదు. అందుకే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు సాకులు వెదుకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిందని రాజకీయం చేయడం చంద్రబాబు, లోకేష్ దిగజారుడుకు నిదర్శనం. వేరే రాష్ట్రాల్లో కూడా ఉత్తీర్ణత తగ్గింది. కానీ అక్కడ ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం లేదు.”
స్వయంగా వైసీపీకీ చెందిన కీలక నాయకులు జూమ్ మీటింగ్ లోకి వస్తే, వాళ్లను ప్రశ్నించడం లోకేష్ కు చేతకాలేదని ఆరోపించారు రోజా. అబద్ధాలు చెప్పడం అలవాటైన లోకేష్ కు, వైసీపీ నాయకులు ఎదురుగా కనిపించేసరికి మాట రాలేదని ఎద్దేవాచేశారు.
“ఫెయిలైన పదో తరగతి పిల్లల్ని చెడగొట్టేందుకు జూమ్ మీటింగ్ పెట్టారు లోకేష్. మహానాడులో తొడగొట్టి సవాల్ చేసిన ఈ పెద్ద మనుషులు, జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వంశీ వస్తే ఎందుకు భయపడి పారిపోయారు. ఏసీ రూముల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడమే వీళ్లకు తెలుసు. జూమ్ లో వంశీ, కొడాలి ఒకేసారి దొరికారు. అక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోయారు.”
చంద్రబాబు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని… లోకేష్ జీవితంలో అసెంబ్లీలో అడుగుపెట్టలేరని.. కనీసం జూమ్ లో వైసీపీ నాయకులు దొరికినప్పుడైనా మాట్లాడాల్సి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు రోజా.