తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయోగాలు

బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టంతా ఇప్పుడు తెలంగాణ మీదనే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకుంది. ఆంధ్రాలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇంకొందరు…

బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టంతా ఇప్పుడు తెలంగాణ మీదనే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకుంది. ఆంధ్రాలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇంకొందరు నాయకులు అంటున్నప్పటికీ అధిష్టానం ఆ రాష్ట్రం మీద పెద్దగా ఫోకస్ చేయడంలేదు. తెలంగాణా మీదనే మొత్తం శక్తియుక్తులన్నీ పెడుతోంది. అనేక ప్రయోగాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మంచి దూకుడు మీద ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న బండి సంజయ్ బాగా యాక్టివ్ గా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ కేసీఆర్ ను, టిఆర్ఎస్ ను చెండాడుతున్నాడు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్ర నాయకులను రాష్ట్రానికి రప్పించి సభలు నిర్వహిస్తున్నాడు. పార్టీలో ఉత్సాహం నింపడానికి తాను కూడా పాదయాత్ర చేశాడు. 

కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను వచ్చే నెలలో హైదరాబాదులో నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఎన్నికల కారణంగానే తెలంగాణాకు చెందిన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపారు. కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అధిష్టానం మరో ప్రయోగం చేయాలని నిర్ణయించిందని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పని చేస్తే తెలంగాణా నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉంటారు. బండి సంజయ్ బాగా పనిచేస్తున్నాడని కేంద్ర నాయకత్వానికి మంచి అభిప్రాయం ఉంది.

ప్రధాని మోడీ, అధ్యక్షుడు నడ్డా హైదరాబాదుకు వచ్చినప్పుడు సంజయ్ ని ప్రశంసించారు కూడా. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సుడిగాలి సృష్టించాలని చూస్తూ ఉంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పార్టీకి అనుకూలంగా ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం నమ్ముతూ ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘనందన్ రావు గెలిచిన తర్వాత తెలంగాణ పట్ల బీజేపీ హైకమాండ్ లో మార్పు వచ్చింది. అంతవరకు అధిష్టానం జోక్యం తక్కువగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండేది. రఘునందన్ గెలుపు మొత్తం పార్టీ తెలంగాణ పాలసీ లో మార్పు తీసుకువచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికను ఫలితాలను విశ్లేషించి, ఇది అల్లాటప్ప గెలుపు కాదని అభిప్రాయపడింది. 

ప్రజల్లో బీజేపీ వైపు మొగ్గు ఉందనే విషయాన్ని బయటపెట్టిన ఎన్నిక అని పార్టీ నమ్మింది. మంచి అభ్యర్థిని పెట్టి ఖర్చుకు వెనకాడకపోతే చాలు, ప్రజలు గెలిపిస్తారని నమ్మింది. అప్పుడే  రాష్ట్ర పార్టీని హైకమాండ్ అదుపులోకి తీసుకుని మరొక ఎన్నికను పరిశీలించాలనుకుంది. అపుడే జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చాయి. అంతే, ఈ ఎన్నికలను పూర్తిగా బీజేపీ హైకమాండ్ తన కంట్రోల్ లోకి తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్ జిహెచ్ఎంసి ప్రధాన వేర్యక్షకుడి గా వచ్చారు. 150 డివిజన్ లలో కనీసం 100 డివిజిన్లలో కేంద్ర కమిటీ పర్యవేక్షకులు తిష్టవేశారు. ఆశించిన ఫలితం వచ్చింది. దీనితో పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణాను తీసేశారు. ప్రయారిటీ రాష్ట్రంగా  పరిగణించడం మొదలు పెట్టారు. 

తర్వాత, నాగార్జున సాగర్ ఎన్నికలో బలమైన అభ్యర్థి దొరక లేదు. కానీ దానిని ఎదురుదెబ్బగా భావించలేదు. ఎందుకంటే, ఆ తర్వాత హూజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచింది. ఈ ఎన్నికను మళ్లీ కేంద్ర కమిటియే పర్యవేక్షించింది. ఇక్కడ స్టేచర్ ఉన్న అభ్యర్థి, ఖర్చుకు వెనకాడకూడదనే నిర్ణయం, పార్టీ అనుకూల వాతావరణం అన్నీ పని చేశాయి. ఈటెల గెలిచారు. దీనితో తెలంగాణలో పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని హైకమాండ్ విశ్వసించడం మొదలుపెట్టింది. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్ర నేతల వైఖరిలో ఒక మార్పు వచ్చింది. అంతకు ముందు  కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రశంసించే వారు. ఇది తెలంగాణ బీజేపీకి ఇబ్బందిగా ఉండేది. అయితే, హైకమాండ్ వ్యవహారం కాబట్టి అసంతృప్తి వెల్లడించలేక పోయేవారు.

బీజేపీ అధికారంలోకి రాదని అనుకునే రోజుల్లో టీఆర్ఎస్ తో సఖ్యంగా ఉండేందుకు కేంద్ర మంత్రులు ఈ  విధానం అనుసరించారు. ఇపుడావసరం లేదు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మంత్రులంతా, నడ్డా నుంచి అమిత్ షా దాకా, టీఆర్ఎస్ సర్కారు మీద, నేతల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్న ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోదీ టీఆర్ఎస్ పేరు పెట్టకుండా కుటుంబ పాలనను దుయ్యబట్టారు. కుటుంబ పాలన అవినీతికి మార్గమని విమర్శించారు. ఎందరో పోరాడి తెచ్చుకున్న ప్రయోజాన్ని కేవలం ఒక కుటుంబమే కాజేస్తూ ఉందని కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఇపుడు పార్టీ పరంగా బీజేపీ గులాబీ పార్టీతో యుద్ధానికి గీత గీసింది.

యుద్ధసేనానిని పేరును ప్రకటించడం ఒక్కటే మిగిలింది. అది బండి సంజయా, ఈటెల రాజేందరా, డికె అరుణా, లేక మరొకరా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలోనే ముందుకు పోవాలా లేక మరొకరిని తీసుకురావాలనే అనే విషయం మీద చర్చ మొదలయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ నాయకత్వం దొరికితే బండి సంజయ్ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. మరి బండి సంజయ్ మాదిరిగా దూకుడుగా ఉండేవారెవరు?