ఓవైపు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుచుకోవాలని పార్టీ నేతలకు ఉపదేశిస్తున్నారు. ఆ దిశగా కష్టపడాలని హితబోధ చేస్తున్నారు. మరోవైపు పార్టీ నాయకులు మాత్రం తమలో తామే గొడవలు పెట్టుకుంటున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, డీసీసీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఇప్పటికే బజారున పడ్డాయి.
తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య కూడా ఇలాంటి విభేదాలే బయటపడ్డాయి. బందరు నీ అడ్డానా అంటూ ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లారంటే.. వారి మధ్య ఏ స్థాయిలో గొడవలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాచ్ తో 2024లో సీఎం జగన్ 175 సీట్లు సాధించగలరా..?
నియోజకవర్గాల్లో పెత్తనం ఎవరికి..?
టీడీపీ నుంచి వైసీపీ వైపు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేకి.. ఇక్కడి క్యాడర్ తో కలవడం ఇబ్బందిగా మారింది. చీరాలలో కరణం, ఆమంచి వర్గాల మధ్య వేడి అలాగే ఉంది. రాపాక వరప్రసాద్ తనకి ఇక ఛాన్స్ లేదని గ్రహించి సైలెంట్ గా ఉన్నారు. మద్దాలి గిరికి కూడా లోకల్ సెగలు తగులుతున్నాయి. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి వెనక్కి తగ్గారు.
ఇక గన్నవరం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అక్కడ వల్లభనేని వంశీకి, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలకు తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. ఇటీవల వల్లభనేనికే టికెట్ అంటూ సజ్జల క్లారిటీ ఇచ్చినా కూడా మరోసారి యార్లగడ్డ ఫైరయ్యారు. వల్లభనేని ఓ విలన్ అంటూ విమర్శించారు, టికెట్ సంగతి అధిష్టానం చూసుకుంటుంది, ఇప్పుడే తొందర అవసరం లేదన్నారు.
ఈ వివాదం ఇలా ఉండగా.. మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరికి, మాజీ మంత్రి పేర్ని నానికి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మచిలీపట్నం పర్యటనలో పేర్ని వర్గీయులు తనను అడ్డుకున్నారంటూ బాలశౌరి విమర్శలు చేశారు. బందరు నీ అడ్డానా నానీ.. అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ గొడవ ముదరకముందే ఇద్దరినీ తాడేపల్లి పిలిపించుకుని మాట్లేడే అవకాశాలున్నాయి. అటు నెల్లూరులో కూడా నాయకుల మధ్య విభేదాలను ఇటీవలే అధిష్టానం సవరించాలని చూసింది.
కుప్పం మున్సిపాల్టీ గెలిచాం, కుప్పం అసెంబ్లీ కూడా గెలుస్తాం.. అనే మాటలు వినడానికి బాగానే ఉంటాయి. కుప్పం ఒక్కటీ గెలిస్తే సరిపోతుందా, మంగళగిరిలో లోకేష్ ని ఓడిస్తే చాలా, పవన్ కల్యాణ్ పోటీచేసిన ప్రతి చోటా వైసీపీ గెలిస్తే సంబరపడాలా..? మిగతా నియోజకవర్గాల సంగతేంటి.. 2019లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెడితే చాలా, వైసీపీ చేతిలో ఉన్న సీట్ల గురించి ఎవరు ఆలోచించాలి, ఇలా ఒకరితో ఒకరు గొడవపడితే ఎలా..?
ఇదే కంటిన్యూ అయితే 175 స్థానాల టార్గెట్ ని వైసీపీ రీచ్ అవుతుందా..? టార్గెట్ మంచిదే, కానీ అంతకంటే ముందు పార్టీలోని వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి కదా..? దీనిపై ముందుగా అధిష్టానం దృష్టిసారించాలి.