పవన్ కళ్యాణ్ మిత్రుడు కానిది ఎవరికీ అంటే ఒక్క వైసీపీకే అని ఎనిమిదేళ్ళ జనసేన చరిత్ర చెబుతుంది. పవన్ పార్టీ పెట్టిన తరువాత దాదాపుగా ఏపీలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. అందులో సీపీఐ కూడా ఉంది. ఇక తాజాగా విశాఖ టూర్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పాత మిత్రుడు మీద పాపం అని ప్రేమ చూపించారా లేక సెటైరికల్ గా మాట్లాడారా అన్నది చూడాల్సిన విషయం.
ఇంతకీ ఆయన ఏమన్నారూ అంటే పవన్ కళ్యాణేమో ఒక వైపు బీజేపీతో జనసేన అని అంటున్నారుట. కానీ బీజేపీ మాత్రం జగన్ జట్టులో ఉందిట. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కి బీజేపీ హ్యాండ్ ఇచ్చి వైసీపీతో చెట్టాపట్టాలు వేస్తోంది అని ఎర్రన్న అంటున్న మాట అనుకోవాలి.
ఇక వైసీపీకి ఉన్న అవసరాలు, బీజేపీకి ఉన్న అవసరాల వల్లనే ఆ రెండు పార్టీలూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని రామక్రిష్ణ చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీకి సర్కార్ నడపడానికి కేంద్ర సాయం తప్పనిసరిగా కావాలని, అలాగే బీజేపీకి కూడా వైసీపీ మద్దతు రాజకీయంగా అవసరం అని విశ్లేషించారు.
ఇక చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ బీజేపీ అభ్యర్ధికే మద్దతు ఇస్తుందని కూడా రామక్రిష్ణ చెప్పడం విశేషం. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ జనసేన మిత్రుత్వానికి బీజేపీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నదే రామక్రిష్ణ బాధా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం. ఏది ఏమైనా తమ వైపు పాత మిత్రుడు రాలేదన్న బాధ కూడా ఆయనలో ఉందని మాటలను బట్టి చూస్తే అర్ధమవుతోంది.
ఇక ఏపీ అప్పు గురించి కూడా రామక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు కొంత చిత్రంగా ఉన్నాయి. 2014 విభజన వేళకు 96 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు కాస్తా జగన్ దిగిపోయేనాటికి పది లక్షల కోట్లు అవడం ఖాయమని రామక్రిష్ణ చెబుతున్నారు. మరి ఈ తొమ్మిది లక్షల కోట్లు అంతా జగన్ చేసిన అప్పుగానే ఆయన చూపించదలచుకున్నారా అన్నదే ఇక్కడ సందేహం.
ఎందుకంటే ఈ మధ్యలో అయిదేళ్ళ పాటు టీడీపీ చంద్రబాబు ఏలారు. టీడిపీ వారి అప్పు కూడా మూడు లక్షల కోట్లు ఉంది అని గణాంకాలు చెబుతున్నారు. మరి ఎందుకో ఎర్రన్న టీడీపీ సర్కార్ చేసిన అప్పులను పక్కన పెట్టి అంతా జగన్ ఖాతాలోనే తోసేస్తున్నారా అన్న డౌట్లు మాత్రం వస్తున్నాయి.