మొన్నటివరకు ఓ రేంజ్ లో తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. ఉన్నట్టుండి సడెన్ గా కలిసిపోయారు. వాళ్లే వర్మ-నట్టికుమార్. ఇంతకీ వీళ్లిద్దరీ ఎందుకు కేసులు పెట్టుకున్నారు.. ఇప్పుడు ఎందుకు కలిసిపోయారు?
మా ఇష్టం.. మా చిచ్చు..
మా ఇష్టం అనే సినిమా విషయంలో ఆర్జీవీ, నట్టికుమార్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఒకప్పుడు ఒకరికొకరు అన్నట్టు ఉన్న వీళ్లిద్దరూ ఆ సినిమాతో విడిపోయారు. అదే టైమ్ లో వర్మ ఇతర సినిమాల్ని రిలీజ్ చేసే పనిలో పడ్డంతో నట్టికుమార్ కోర్టుకెక్కారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, వర్మ వేరే సినిమాలు తీసుకుంటున్నారని, ఆయన సినిమాపై స్టే విధించాలని కోర్టును కోరారు.
దీనిపై వర్మ కూడా అదే స్థాయిలో స్పందించారు. తన సంతకాన్ని నట్టికుమార్ ఫోర్జరీ చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్ కాపీ చేసి, సంతకం ఫోర్జరీ చేశారనేది వర్మ ఆరోపణ. ఇలా అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న వ్యవహారం ఇప్పుడు ఒక్కసారిగా సద్దుమణిగింది.
ఇప్పుడేం జరిగింది..
ఉన్నట్టుండి సడెన్ గా వర్మ-నట్టికుమార్ కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ మధ్య జరిగిన గొడవలన్నీ క్లియర్ అయిపోయాయని, అందుకే మేమిద్దరం కాఫీ తాగడానికి వచ్చామంటూ వీడియో రిలీజ్ చేశాడు ఆర్జీవీ. “చాలామంది మేమిద్దరం కలిశామంటే నమ్మకపోవచ్చు. అందుకే వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు నేను ఆయన గురించి అన్నవి. ఆయన నా గురించి అన్న మాటలు తూచ్ అయిపోయాయి. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పనిచేస్తాం.” అని ప్రకటించారు.
ఇదే వీడియోలో నట్టికుమార్ కూడా స్పందించారు. కొందరు మధ్యవర్తులు పెట్టిన చిచ్చు వల్ల తమ మధ్య గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయని అన్నారు. ఇకపై తామిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసిమెలిసి ఉంటామని అన్నారు.
ఆర్జీవీపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్టు నట్టికుమార్ ప్రకటించారు. అటు వర్మ కూడా నట్టికుమార్ పై పెట్టిన కేసుల్ని విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించాడు. ఇద్దరి మద్య కేవలం ఆర్థిక వివాదాలే తప్ప, కుటుంబాల పరంగా ఎలాంటి విబేధాలు లేవని ఇద్దరూ ప్రకటించుకున్నారు.