ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేవాళ్లను చాలామందిని చూస్తుంటాం. అయితే అది వాళ్లిష్టం. కానీ ఇందులో కూడా సమయం-సందర్భం చూసుకోవాలి. అలా ముందు వెనక ఆలోచించని మహిళా ఉద్యోగులు డాన్స్ చేసి తమ ఉద్యోగం పోగొట్టుకున్నారు.
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ జిల్లాలో పవిత్ర మహాకాళ్ ఆలయంలో బాలీవుడ్ పాటకు డాన్స్ చేసి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఇదే విధంగా అయోధ్యలోని పవిత్ర రామమందిరం ప్రాంగణంలో డాన్స్ చేసి, ఏకంగా నలుగురు మహిళా కానిస్టేబుళ్లు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది మహిళా కానిస్టేబుళ్లు. ఉన్నట్టుండి బోర్ కొట్టిందేమో.. అంతా కలిసి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నారు. ఊరికే వీడియో తీయడం ఎందుకని, ఓ భోజ్ పురీ మసాలా పాటకు డాన్స్ చేసి ఆ వీడియో పెట్టారు.
పవిత్ర ఆలయం ప్రాంగణంలో ఇలా డాన్స్ చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో ఎస్పీ స్థాయి వ్యక్తితో ఎంక్వయిరీ చేసి నిజనిర్థారణ చేశారు. కవితా పటేల్, కామినీ, కాషిశ్ సాహ్ని, సంధ్యా సింగ్ అనే ఆ నలుగురు మహిళా కానిస్టేబుళ్లను ఈరోజు విధుల నుంచి సస్పెండ్ చేశారు.