అది ఒకే ఇల్లు. కానీ అందులో సగం మహారాష్ట్రలో ఉంది. మిగతా సగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. చంద్రపూర్ జిల్లాలోని మహారాజ్ గూడ గ్రామంలో ఉంది ఆ ఇల్లు. ఈ ఇంటిలో మొత్తం 8 గదులు ఉన్నాయి. వీటిలో 4 గదులు మహారాష్ట్రలో ఉంటే, మిగతా 4 గదులు తెలంగాణలో ఉన్నాయి.
ఉత్తమ్ పవార్ తో పాటు అతడి సోదరుడు కుటుంబాలు రెండూ ఇందులో ఉంటున్నాయి. వీటిలో ఉత్తమ్ పవార్ సోదరుడి గదులన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. ఉత్తమ్ పవార్ గదులు మాత్రం కొన్ని మహారాష్ట్రలో ఉంటే, మరికొన్ని తెలంగాణలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తమ్ వంటగది తెలంగాణలోనే ఉంది.
అయితే ఇలా ఉన్నందుకు ఉత్తమ్ బాధపడడం లేదు. రెండు రాష్ట్రాల్లో పన్నులు చెల్లిస్తున్నాడు. అందుకు కూడా ఆయన బాధపడడం లేదు. ఎందుకంటే, 2 రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి తాము లబ్ది పొందుతున్నామని తెలిపాడు ఉత్తమ్. ఇటు తెలంగాణ పథకాలతో పాటు, అటు మహారాష్ట్ర పథకాలు కూడా తమకు వర్తిస్తున్నాయని, వాటితో హ్యాపీగా ఉంటున్నామని అన్నాడు.
ఇప్పటివరకు తమకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు ఈ ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు. తమ కారుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్ తీసుకున్నట్టు, బైక్ ను మహారాష్ట్రలో రిజిస్టర్ చేయించినట్టు తెలిపారు.