దిల్ రాజు చేసిన కామెంట్స్ కొన్ని నిన్నట్నుంచి తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు, అక్కడితో ఆగకుండా తను గ్లామరస్ గా ఉంటాను కాబట్టే తనపై వివాదాలు సృష్టిస్తున్నారంటూ మరో ఫన్నీ కామెంట్ కూడా చేశారు.
దిల్ రాజు వ్యాఖ్యలతో కోలీవుడ్ అట్టుడికిపోతోంది. సోషల్ మీడియాలో విజయ్, అజిత్ ఫ్యాన్స్ వీరలెవెల్లో కొట్టుకుంటున్నారు. ఇదే కామెంట్ తెలుగు హీరోలపై చేసుంటే ఈ పాటికి శవాలు లేచేవంటూ టాలీవుడ్ లో కొన్ని ఫ్యాన్ గ్రూప్స్ కూడా చర్చల్లో తలదూర్చాయి.
ఇలా వివాదాస్పదంగా మారిన దిల్ రాజు, ఈరోజు ప్రెస్ మీట్ కు మీడియాను పిలిచారు. దిల్ రాజు ప్రెస్ మీట్ అనగానే టోటల్ మీడియా మొత్తం వాలిపోయింది. సాధారణంగా జరిగే ప్రెస్ మీట్స్ కు మీడియా జనాలు అరకొరగా మాత్రమే హాజరవుతారు. కానీ ఇది వివాదాస్పమైన ప్రెస్ మీట్ కావడంతో, కోలీవుడ్ మీడియా కూడా ఓ కన్నేసింది. ఈమధ్య కాలంలో ఏ కార్యక్రమానికీ హాజరుకానంత మీడియా దీనికి వచ్చింది.
కట్ చేస్తే, దిల్ రాజు పిలిచింది తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం కోసం కాదు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట కొత్త బ్యానర్ పెట్టాడు ఈ నిర్మాత. బ్యానర్ పేరులో దిల్ రాజు ఉన్నప్పటికీ, నిర్మాతలుగా మాత్రం తన కుటుంబానికి చెందిన ఇద్దరి పేర్లు వేశాడు.
ఈ బ్యానర్ పై తీసిన తొలి సినిమా బలగం. ఈ సినిమాను పరిచయం చేసేందుకు మీడియాను ఆహ్వానించాడు. మీడియా మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోసం దిల్ రాజు పిలిచాడనుకొని పోలోమంటూ వెళ్లింది. తీరా లోపలోకి వెళ్లిన తర్వాత 'బలగం' చూసి ఖంగుతింది. 'దిల్ రాజు కీలక ప్రెస్ మీట్' అంటూ లైవ్ లు ఇచ్చిన యూట్యూబ్ ఛానెళ్లు లబోదిబోమన్నాయి. చివర్లో మీడియా అడిగినప్పటికీ, తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించాడు దిల్ రాజు.