గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం చేయడంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. గత మూడున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి, మరోసారి వారి ఆశీస్సులు అడగాలని తమ పార్టీ ఎమ్మెల్యేలను జగన్ జనంలోకి పంపిన సంగతి తెలిసిందే. దీనికి గడపగడపకూ మన ప్రభుత్వం అనే పేరు పెట్టారు.
ఇందులో భాగంగా ఇవాళ వైసీపీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఫర్మామెన్స్‌ను వారి ఎదుట పెట్టారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జగన్ నిర్దేశించిన 70 రోజుల కాలానికి గాను అత్యధిక కాలం జనంలో వున్న ఎమ్మెల్యేలు 20 మంది అని జగన్ చెప్పారు. వీరిలో 66 రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈయన సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇక సగం రోజులు కూడా జనంలో లేని ఎమ్మెల్యేలు 30 మంది ఉన్నట్టు సీఎం అందరి సమక్షంలో చెప్పారు. ఇదిలా వుండగా ప్రొద్దుటూరులో శివప్రసాద్‌రెడ్డి ప్రతి గడపకూ వెళుతూ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే పరిష్కారానికి ఆయన చొరవ చూపుతున్నారు.
అయితే ఇవాళ్టి గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంపై సీఎం సమీక్ష సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వెళ్లలేదు. ముఖ్యమైన పని కారణంగా వైసీపీ పెద్దల నుంచి అనుమతి తీసుకుని వెళ్లనట్టు తెలిసింది.