వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక కలిసి శుక్రవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకెళ్లారు. ఇవాళ శోభానాగిరెడ్డి వర్ధంతి. దీంతో తల్లికి నివాళులర్పించేందుకు మనోజ్‌ను మౌనిక వెంటబెట్టుకుని ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌కు వెళ్లారు. ఇద్దరూ కలిసి శోభా నాగిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.
ఇదిలా వుండగా మౌనిక పర్యటన సందర్భంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూమా మౌనిక, మనోజ్ సరిగ్గా ఉదయం 9.45 గంటలకు భూమా నాగిరెడ్డి దంపతుల ఘాట్‌కు చేరుకున్నారు. అదే సమయానికి ఇంటి నుంచి మాజీ మంత్రి అఖిలప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి, భర్త భార్గవ్‌రామ్‌తో కలిసి ఘాట్‌కు బయల్దేరారు. అయితే మౌనిక, మనోజ్ అక్కడ ఉన్నారని తెలుసుకున్న అఖిలప్రియ… తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఘాట్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో చిన్నకందుకూరులోని భైరవస్వామి ఆలయానికి భర్త, తమ్ముడితో కలిసి వెళ్లడం గమనార్హం. చెల్లి మౌనిక, ఆమె కాబోయే భర్త మనోజ్‌తో కలవడం ఇష్టం లేకే అఖిలప్రియ భైరవస్వామి ఆలయానికి వెళ్లినట్టు ఆళ్లగడ్డలో చర్చ జరుగుతోంది.
ఇదిలా వుండగా మౌనిక, మంచు మనోజ్‌లకు ఘాట్‌లో భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడైన ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ బీవీ నాగిరెడ్డి, అఖిలప్రియ బాధిత టీడీపీ నేత బాచాపురం శేఖరరెడ్డి, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మనోజ్‌తో పెళ్లి కావడమే ఆలస్యం… ఆళ్లగడ్డలో మౌనిక తనదైన రాజకీయాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో వున్నారని సమాచారం.