పవన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్నది మనకు తెలియదు. కానీ ఈ లోగా ఆయన సిఎమ్ నే అనుకంటే ఫస్ట్ మినిస్టర్ మాత్రం మన దర్శకుడు త్రివిక్రమ్ నే. ఎందుకంటే పవన్ దగ్గర పని జరగాలి అన్నా, పవన్ కు ఏదైనా విషయం విన్నవించాలి అన్నా, పవన్ ను దేనికైనా ఒప్పించాలి అన్నా ఒక్క త్రివిక్రమ్ వల్లనే సాధ్యం. మరెవరివల్లా కాదు ఇప్పటికైతే.
నెల రోజుల నుంచి కుస్తీ పడుతున్నారు ఆహా టీమ్. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని. అప్పటికే డైరెక్ట్ గా ఫోన్ లో బాలయ్య అడగనే అడిగారు త్రివిక్రమ్ ను. ‘ఎవరితో రావాలో తెలుసు కదా’ అంటూ. అంటే బాలయ్యకు కూడా తెలుసు. ఎక్కడ స్విచ్ వేస్తే పవన్ దగ్గర బల్బ్ వెలుగుతుందో.
నిన్నటికి నిన్న అదే జరిగింది. మైహొమ్ సంస్థతో వున్న సంబంధాల రీత్యా త్రివిక్రమ్ వెళ్లి రోజంతా హరిహర వీరమల్లు షూట్ లో కూర్చున్నారు. మొత్తం మీద ఈ నెల 27 అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు వెళ్లడానికి పవన్ ను ఒప్పించారు. మరి పవన్ అంటే త్రివిక్రమ్ కూడా వెళ్లాలి కదా? కానీ అక్కడ ఓ చిక్కు వుంది.
అసలే ఈ మధ్యనే మహేష్ బాబు దగ్గర అంతా సెట్ అయింది. పవన్ సినిమాల మీద వుంటున్నారు. పవన్ సినిమాల సెట్టింగ్ లు చేస్తున్నారు. పవన్ సినిమాల స్క్రిప్ట్ లు రాస్తున్నారు. ఇలా పవన్..పవన్..పవన్ అనే మాటలు మీడియాలో చదివి చదివి మహేష్ ఎలా రియాక్ట్ కావాలో అలా రియాక్ట్ అయ్యారని బోగట్టా. దాంతో కిందా మీదా పడి మహేష్ ను దారిలోకి తెచ్చుకున్నారు.
ఇప్పుడు అన్ స్టాపబుల్ షో కి పవన్ తో వెళ్తే మళ్లీ ఏం తలకాయనొప్పి వస్తుందో. పైగా పవన్-బాలయ్య అంటే కాస్తయినా పొలిటికల్ టచ్ వుంటుంది. అలాంటి వేళ త్రివిక్రమ్ మధ్యలో వుంటే కాస్త ఎంబ్రాసింగ్ వ్యవహారమే. అందుకే తెలివిగా దర్శకుడు క్రిష్ ను సెట్ చేసి త్రివిక్రమ్ తప్పుకున్నారు. దీనికి పవన్ సై అన్నారు అంటే త్రివిక్రమ్ ప్రభావం ఎంత వుందో అంచనావేసుకోవచ్చు.
ఈ మధ్యనే సుజిత్, హరీష్ శంకర్ సినిమాలు అనౌన్స్ చేసారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనవరి నుంచి వినోదయసితం సినిమా రీమేక్ కు షెడ్యూలు కు పవన్ ను త్రివిక్రమ్ ఒప్పించారు.
రాజకీయాల వరకు పవన్ కు నాదెండ్ల మనోహర్ సచివుడు కావచ్చు. కానీ పర్సనల్ వ్యవహారాలు, సినిమా వ్యవహారాల్లో మాత్రం అన్ని విధాలా మంత్రి త్రివిక్రమ్ నే అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. రీమేక్ లు చేస్తుంటే ఫ్యాన్స్ కూడా పవన్ ను ఏమీ అనడం లేదు. త్రివిక్రమ్ నే అంతా చేస్తున్నారని ఫీలవుతున్నారు.
మొత్తానికి పవన్ దగ్గర త్రివిక్రమ్ హవా అలా నడుస్తోంది.