టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు తనయుడు, యువ నటుడు మంచు మనోజ్ రెండో వివాహ ముహూర్తం ఖరారైంది. రాయలసీమకు చెందిన ప్రముఖ రాజకీయ నేత దివంగత భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల రెండో కుమార్తె మౌనికను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. 2023, ఫిబ్రవరి 2న వాళ్లిద్దరి పెళ్లికి ముహూర్తం నిశ్చయమైనట్టు విశ్వసనీయ సమాచారం.
మంచు మనోజ్, మౌనికలిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మౌనికకు కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా మొదటి వివాహాలు వారికి కలిసి రాలేదు. దీంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం మంచు మనోజ్, భూమా మౌనిక కొంత కాలం చెన్నైలో కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ హైదరాబాద్‌లో కలిసి వుంటున్నారని తెలిసింది.
గత సెప్టెంబర్‌లో సికింద్రాబాద్‌లో గణేశ్ మండపానికి మౌనికతో కలిసి మనోజ్ వెళ్లారు. అప్పుడే వాళ్లిద్దరి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. అయితే మౌనికతో పెళ్లి, అలాగే రాజకీయాల్లో ప్రవేశంపై సమయం వచ్చినప్పుడు చెబుతానని మనోజ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వాళ్లిద్దరి పెళ్లిపై మరోసారి వార్తలు బయటికొచ్చాయి.
తమ పెళ్లికి రావాలని మిత్రులు, బంధువుల్ని మనోజ్, మౌనిక ఆహ్వానిస్తున్నారు. ఇదిలా వుండగా వీళ్ల పెళ్లి ముహూర్తాన్ని ఇరు వైపు కుటుంబ పెద్దలు నిశ్చయించారా? లేదా? అనేది స్పష్టత రావాల్సి వుంది. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జరగనుందన్నది వాస్తవం.