ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం చేలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రోహిత్‌రెడ్డి కీలక ఎమ్మెల్యే. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ జరిగింది. ఇందులో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కేసీఆర్ సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారంలో రోహిత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ఆయన అన్నట్టుగా రోహిత్‌రెడ్డికి ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేయడం మరోసారి రాజకీయ రచ్చకు తెరలేచింది.
బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డికి సంబంధం వున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో విచారణకు రావాలని ఆయనకు నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా తన ఇంట్లో ఈడీ నోటీసులు అందించిందని, వాటిని ఇంకా చూడలేదని, వివరాలు తెలియదని ఆయన మీడియాతో అన్నారు.
19న విచారణకు రావాలని ఉన్నట్టు ఆయన చెప్పారు. బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంక్ లావాదేవీల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో కోరినట్టు రోహిత్‌రెడ్డి చెప్పారు. ఇదిలా వుండగా రకుల్‌ప్రీత్ సింగ్‌కు కూడా డ్రగ్స్ వ్యవహారంలోనే నోటీసులు అందినట్టు సమాచారం.