ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భూమి పూజ చేశారు. వైఎస్సార్టీపీ ప్రస్థానంలో ఇది కీలక ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే పాలేరు నుంచే షర్మిల బరిలో దిగనున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ పునాదులను బలోపేతం చేసే క్రమంలో షర్మిల కీలక అడుగు వేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ ప్రసంగిస్తూ వైఎస్సార్టీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. రానున్న రోజుల్లో తెలంగాణను పాలించే ఊరు పాలేరు అవుతుందన్నారు. షర్మిల నాయకత్వంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా గుమ్మం అవుతుందని చెప్పడం విశేషం. తెలంగాణలో రాజన్న రాజ్యం ద్వారా ప్రజలకు సంక్షేమ పాలన అందించి వారి జీవితాలు బాగు చేయాలనే గొప్ప సంకల్పంతో షర్మిలమ్మ ముందుకెళ్తోందన్నారు.
ఉదయంచే సూర్యుడిని ఎవరూ ఆపలేరని …తన కుమార్తె షర్మిలను ఎవరూ అడ్డుకోలేరనే పరోక్ష సంకేతాల్ని విజయమ్మ ఇచ్చారు. గొప్ప సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలను అందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. షర్మిలను తెలంగాణ బొబ్బిలిగా అభివర్ణించారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, సహనంతో అన్ని భరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేయాలని అనుకోవడమే షర్మిల చేసిన తప్పా? అని విజయమ్మ ప్రశ్నించారు.
పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టి… తెలంగాణ బిడ్డ కాదనే వారికి సరైన సమాధానం షర్మిల ఇచ్చారన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని దీక్షకు దిగితే, ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేశారని విజయమ్మ మండిపడ్డారు. రైతులను కాపాడు దొరా అని అంటే అరెస్ట్ చేశారన్నారు. ప్రజల బాధలను పరిష్కరించాలని అడిగిన పాపానికి షర్మిలను కొట్టి, తిట్టి, ఈడ్డుకెళ్లారున్నారు. ఎన్ని చేసినా వైఎస్ రక్తం దేనికి భయపడదని విజయమ్మ తేల్చి చెప్పారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా తెలంగాణ నుంచి షర్మిలను వేరు చేయలేరని విజయమ్మ స్పష్టం చేశారు.