ప్రధాని మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీపై తెలంగాణలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలపై ఆయనకు అధిష్టానం షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఇందుకు ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో చేపట్టిన వివిధ పదవుల నియామకాల్లో కోమటిరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో ఆయన్ను పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా సాగింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి ఓడిపోయారు. కానీ రెండో స్థానంలో నిలిచారు. తమ్మునికి మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాయిస్‌తో విడుదలైన ఆడియో కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉన్న వెంకటరెడ్డి ఇవాళ ప్రధాని మోదీని కలవడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఓ అసంతృప్త నేత ప్రత్యర్థి పార్టీకి చెందిన అగ్ర నాయకుడితో భేటీ కావడం వెనుక… ఏ రాజకీయ ఉద్దేశం లేదంటే ఎవరూ నమ్మరు. ప్రధానితో భేటీ తర్వాత వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన అంశాల కంటే… కొన్ని విషయాల్ని తాను బయటికి చెప్పలేననడంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు రాజకీయాలు మాట్లాడ్తా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రధానితో చర్చించిన కొన్ని అంశాల్ని తాను బయటికి చెప్పలేనని వెంకటరెడ్డి అనడం గమనార్హం. ఇక్కడే వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎవరికి తోచిన విధంగా వారు ఈ మాటల వెనుక అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే వెంకటరెడ్డి కోరుకుంటున్నారు.
రాజకీయం అంటే ఇదే మరి. ప్రధానితో కేవలం అభివృద్ధి సంగతులపైన్నే మాట్లాడేందుకు వెళితే… చెప్పలేననే మాట ఎందుకొస్తుందని ప్రత్యర్థుల ప్రశ్న. చెప్పలేనని ప్రత్యేకంగా చెప్పడం దేనికి? అలాంటివి వుంటే మనసులో పెట్టుకోవచ్చు కదా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.