Advertisement

Advertisement


Home > Movies - Reviews

Avatar 2 Review: మూవీ రివ్యూ: అవతార్2

Avatar 2 Review: మూవీ రివ్యూ: అవతార్2

టైటిల్: అవతార్2
రేటింగ్: 3/5
తారాగణం: సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు
కెమెరా: రసెల్ కార్పెంటర్
ఎడిటింగ్: స్టీఫెన్ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నెర్, జాన్ రెఫు, జేమ్స్ కేమరూన్
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్
నిర్మాత: జేమ్స్ కేమరూన్, జాన్ లండౌ
దర్శకత్వం: జేమ్స్ కేమరూన్
విడుదల: 16 డిసెంబర్ 2022

2009 నాటి "అవతార్" అప్పట్లో పపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఆ చిత్రానికి మించిన కలెక్షన్ ఈ 13 ఏళ్లల్లో మరే చిత్రమూ చెయ్యలేకపోయింది. ఏకంగా 3 బిలియన్ డాలర్ల వరకు థియేటర్స్ నుంచి రాబట్టిన ఆ చిత్రానిది తిరుగులేని ప్రపంచ రికార్డు. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ అవతార్-2 గా దాని సీక్వెల్ మనముందుకొచ్చింది. అప్పటి రికార్డు రిపీట్ చేస్తుందా లేక అంతకంటే ఎక్కువ చేసి చరిత్రను తిరగరాస్తుందా, లేక ఫలితం మరోలా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. 

సీక్వెల్స్ అనేవి కొత్త కాదు. అయితే తీసిన సినిమాకి ముగింపు పలికేస్తే తదుపరి తీసే సీక్వెల్ పై ఉత్కంఠ కలిగించడం చాలా కష్టం. ఉదాహరణకి బాహుబలి ఫస్ట్ పార్టుతో కథ అయిపోలేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే ప్రశ్నతో ముగిసింది. సమాధానం రెండవ భాగంలో చూడమన్నారు. నిజానికి అదొక లాంగ్ ఇంటర్వల్. పది నిమిషాల ఇంటర్వల్ బదులుగా రెండేళ్ల ఇంటర్వల్ అన్నమాట. ఆ ఉత్కంఠవల్ల రెండవ భాగానికి విపరీతమైన క్రేజ్ వచ్చి మొదటి భాగం కంటే మూడింతలు ఎక్కువ వసూలు చేసింది థియేటర్స్ నుంచి. 

అటువంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నతో కూడిన ముగింపు అవతార్-1 లో లేదు. అక్కడికి ఆ సినిమా అయిపోయిందన్నట్టే అనిపించింది. మళ్లీ ఏకంగా 13 ఏళ్లకి ప్రేక్షకుల్ని తట్టి లేపి సీక్వెల్ చూడమంటే ఆసక్తి గొలిపే అంశాలేవిటి అనే ప్రశ్న వస్తుంది. ట్రైలర్లో చూస్తే అవే మొహాలు, అవే గ్రాఫిక్స్. ఒకసారి అనిపించిన అద్భుతం మళ్లీ మళ్లీ అనిపించదు కదా! 

2009 లో అవతార్ ని జనం నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూసిన మాట వాస్తవం. కానీ 13 ఏళ్ల తర్వాత కూడా అలాగే చూడమనడం సాహసమే. పాత్రలు అవే అయినా, గ్రాఫికల్ వండర్ అదే అయినా భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన కథనం ఉంటే తప్ప ఆకట్టుకోదు. మరి అవి ఉన్నాయా? 

ఒక్కసారి అవతార్-1 ని కొంచెం చెప్పుకుందాం. పండోరా అనే గ్రహం మీద అన్-అబ్టేనియం అనే విలువైన ఖనిజం ఉందని, దానిని కొల్లగొట్టాలని భూలోకవాసులు ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో భాగంగా జెక్ సల్లీ అనే ఒకతనిని క్రయోజెనిక్ స్లీప్ లో పెట్టి పండోరా గ్రహం పై బతకగలిగే విధంగా అతని క్లోన్ ని తయారు చేస్తారు. అసలు వ్యక్తి నిద్రలోనే ఉంటాడు. కానీ అతని మైండ్ మొత్తం ఈ కొత్త శరీరంలో పని చేస్తుందన్నమాట. అలా తయారు చేయబడిన హీరోగారి క్లోన్ శరీరాన్ని పండోరా గ్రహానికి పంపుతారు. అతను చేయవలసిన పని ఆ గ్రహవాసులతో మమేకమైపోయి విలువైన ఖనిజాలున్న ఆ గ్రహాన్ని ఖాళీచేయించడం. కానీ మన హీరో అక్కడి జనంతో మమేకమైపోయి, అక్కడి అమ్మాయిని ప్రేమించి, వాళ్లకి లీడరైపోయి భూలోకవాసుల నుంచి ఆ గ్రహాన్ని కాపాడతాడు. 

అదీ అవతార్-1 పార్ట్ కథ. 

జేక్ సల్లీ చేసిన పనికి చిరాకెత్తిన కల్నల్ అతనిని ఆ గ్రహానికి వెళ్లి చంపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తాను కూడా క్రయోజెనిక్ స్లీప్ మోడ్ లోకి వెళ్లి తన క్లోన్ ని తయారుచేయించుకుంటాడు. ఆ శరీరంతో తన టీం తో పండోరా మీదకు వాలడంతో అవతార్-2 కథ మొదలవుతుంది. 

కథగా చెప్పుకోవాలంటే అవతార్ 2 చాలా చిన్నది. పండోరా గ్రహం మీద కల్నల్ టీం దాడి జరుగుతుంది. ఆ దాడిలో హీరో కుటుంబం చిక్కుకుంటుంది. ఆ కుటుంబ సభ్యులు ఆ దాడి నుంచి తప్పించుకుని ఒక తెగకు చెందిన జలవాసుల వద్ద తలదాచుకుంటారు. వాళ్ల సాయంతో కౄరులైన భూలోకవాసుల్ని ఎదిరించి ఓడిస్తారు. 

ఇంత చిన్న కథని 3.12 గంటలసేపు తెర మీద నడపాలంటే ఎంత స్క్రీన్ ప్లే ఉండాలి? ఎంత ఎమోషన్ పండాలి? ఎన్ని బలమైన ట్విస్టులుండాలి? అవన్నీ ఉండాల్సినన్ని ఉన్నాయి.  చివర్లో "సన్ ఫర్ ఏ సన్" అనే వాక్యానికి హీరో అర్ధం చెప్పే సన్నివేశమైతే బాగా కదిలిస్తుంది. కాల్పనిక ప్రపంచంలో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల సమ్మేళనం ఈ చిత్రం. 

రామాయణంలో వానరుల్ని పోలిన వేషధారణలో ఉంటారు అందరూ. వనవాసులది నీలిరంగైతే, జలవాసులది ఆక్వా బ్లూ. నీటిని ఆశ్రయించుకుని బ్రతికే జీవులు, వాటితో మమేకమయ్యి వాటిని అవసరానికి వాడుకునే విధానం అంతా అవతార్1 లో చూపించిన మాదిరిగానే ఉంది. 

శత్రువు బాధని అర్ధం చేసుకుని సాయమందిస్తే శత్రుత్వం మాయమైపోయి స్నేహం విరాజిల్లుతుందని ఈ కథలో ఒక నీతిని ప్రబోధించాడు పాయకన్ అనే ఒక సముద్రజీవి ద్వారా. 

ఇండియన్ మైథాలజీ షేడ్స్ కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. 

1. ప్రహ్లాదుడు-హిరణ్యకశపుడు టైపులో... స్పైడర్- అతని తండ్రైన కల్నల్ మధ్య ఒక చిన్న ట్రాక్ నడుస్తుంది. 

2. హీరో కుటుంబం జలవాసుల వద్ద తలదాచుకోవడం పాండవులు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో తలదాచుకున్న ఎపిసోడ్ గుర్తొస్తుంది. 

3. రాముడు వానరుల సాయంతో లంకపై గెలిచినట్టు ఇక్కడ జేక్ సల్లీ జలవాసుల సాయంతో భూలోకవాసులపై గెలుస్తాడు. 

ఇలా ఇండియన్ మైథాలజీ సన్నివేశాలని పోలిన త్రెడ్లు కనిపిస్తూనే ఉంటాయి ఈ సినిమాలో. 

ఎంత గొప్ప కథ రాయాలన్నా రామాయణభారతాల్ని దాటి వెళ్లడం కష్టమని అంటుంటారు. జేంస్ కేమరూన్ కి కూడా అది అవగతమయ్యే ఉంటుంది. 

పదమూడేళ్ల క్రితమే ఏదో ఇంటర్వ్యూలో అవతార్ పాత్రలకి నీలిరంగు పులిమి, తోకలు పెట్టడమనేది రామాయణం నుంచే స్ఫూర్తి పొందానని చెప్పాడు. అది పార్ట్ 2 కి కూడా కొనసాగింది. కాన్షియస్ గానో, సబ్ కాన్షియస్ గానో రామయణ మహాభారతాల ఇంఫ్లుయన్స్ లో ఉండే ఈ రెండవ భాగం కథ కూడా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. 

ఇక నటీనటుల పనితనం గురించి చెప్పుకోవడానికేమీ లేదిందులో. ఎందుకంటే మోషన్ గ్రాఫిక్స్ లో అసలు నటీనటుల రూపాలు మనకి కనపడవు. ఇందులో టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ ఎక్కడుందో చెప్పమంటే ఆమె అభిమానులు కూడా కనిపెట్టలేరు. అదీ పరిస్థితి. 

గ్రాఫిక్స్ కోసం పడిన కష్టం మాత్రం బాగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి నలుగురు ఎడిటర్స్ పనిచేసినా కూడా 3.12 గంటల నిడివికి మించి తగ్గించలేకపోయారంటే వాళ్లల్లో ఒకరు జేమ్స్ కేమరూన్ కూడా కావడమేమో. తీసిన సన్నివేశాలపై మమకారం ఎక్కువైతే ఎడిటింగ్ చేయడం కష్టం. 

ఫస్టాఫ్ చాలా సేపు డ్రాగ్ అనిపిస్తుంది. అక్కడక్కడే తిరుగుతూ మొమెంటం లేకుండా పడి ఉంటుంది. సెకండాఫ్ మాత్రం గ్రిప్పింగ్ గా సాగుతుంది.

నేపథ్యసంగీతం కూడా అవసరానికి తగ్గటుగా ఉంది గానీ పెద్దగా మేజిక్ క్రియేట్ చేయలేకపోయింది. విజువల్గా మాత్రం ఐదుకైదు మారుకులేయడం తప్ప వంక పెట్టడానికి ఏమీ లేదు. 

డిసెంబర్ నెలలో ఈ చిత్రం విడుదలవడం చాలా ప్లస్ పాయింట్. సెలవల సీజన్ వల్ల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించవచ్చు. ఎంత లభించినా నిర్మాతకి లాభించేది ఎంతనేది చూడాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప బ్రేకీవెన్ కాదని జేమ్స్ కేమరూన్ చెప్పాడు. ఆ నెంబర్ ని తాకడం అనుమానమే. తాకితే మాత్రం అద్భుతమే. 

బాటం లైన్: యుద్ధాలు, భావోద్వేగాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?