నీతులు చెప్పేందుకే తప్ప, ఆచరించడానికి కాదని రామోజీరావు నేతృత్వంలో నడుస్తున్న “ఈనాడు” మీడియా సంస్థ తన రాతల ద్వారా చాటి చెబుతోంది. తాను నీతిగా వ్యవహరిస్తూ , ఇతరులకు చెబితే ఎవరికైనా గౌరవం వుంటుంది. నీతి, నిజాయతీలను ఆచరించే వారెవరైనా ఎదుటి వాళ్లకు హితబోధ చేయరు. తమ నడవడికే ఓ సందేశంగా వారు భావిస్తారు. కానీ రామోజీరావు మాత్రం నైతికత, విలువలనేవి తనకు గిట్టని రాజకీయ నేతలకు ఉండాలని కోరుకుంటారు. తనను నిలదీస్తారనే కనీస స్పృహ కూడా లేకుండా ఆయన శుద్ధులు చెప్పడం విమర్శలకు దారి తీస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను అడ్డుపెట్టుకుని రూ.2,600 కోట్లు వసూలు చేసి ఇతర సంస్థల్లోకి మళ్లించారనేది ఆయనపై ప్రధాన అభియోగం. దాదాపు 2.50 లక్షల మంది నుంచి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేశారనేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపణ. ప్రస్తుతం రామోజీరావు ఆర్థిక నేరంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈయన సారథ్యంలో నడిచే ఈనాడు పత్రిక నైతికత, విలువల గురించి చెప్పడం… దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ ప్రభుత్వంపై రామోజీరావు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆయన కేబినెట్లోని మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రతిరోజూ విషం చిమ్మడమే పనిగా ఈనాడు కథనాలు రాస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నైతికతను ప్రశ్నిస్తూ ఈనాడు కథనం రాసింది. నెల్లూరు జిల్లా కోర్టులో మంత్రికి సంబంధించి కేసు డాక్యుమెంట్స్ చోరీ కావడంపై హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది.
“నైతికతకు చోటేది?” అనే శీర్షికతో రాసిన కథనంలో ఈనాడు ఏమని ప్రశ్నిస్తోందంటే… “ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ ఘటనపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అందరూ వేలెత్తి చూపుతున్నా, ఆయనకు చీమ కుట్టినట్టైనా లేదా? హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంలో మిమ్మల్ని ప్రతివాదిగా చేర్చినా, సీబీఐ కేసు నమోదు చేసినా, ఏమీ పట్టనట్టు ఎలా వుండగలుగుతున్నారు? మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారు? పదవే ముఖ్యమని అనుకుంటూ నైతికత, విలువల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదా?” అంటూ తన ప్రశ్నలను, అసహనాన్ని ప్రతిపక్షాలపై వేసి ఈనాడు తన దురుద్దేశాన్ని చాటుకుంది.
సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారెవరైనా పదవి నుంచి తప్పుకుని నైతికత, విలువలు పాటించాలనే ఈనాడు ఆకాంక్ష మంచిదే. అయితే సమస్యల్లా, ఈ విషయాన్ని చెబుతున్న వారికి నైతిక అర్హత ఉందా? అనేదే. రూ.2,600 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, దానిపై సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న యజమాని సారథ్యం వహిస్తున్న ఈనాడు నీతులు చెప్పడమే విడ్డూరంగా వుంది.
పైగా సదరు ఆర్థిక నేరాలకు సంబంధించి ఇప్పుడు కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాటి కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న సమయంలో ఎదుటి వాళ్లకు హితబోధ చేయడం కాస్త వింతగా తోస్తోంది. 2006లో మార్గదర్శిలో జరుగుతున్న ఆర్థిక నేరాలను అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటికి తీశారు. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్సార్ తనపై వ్యక్తిగత కక్షతో దాడులు చేయిస్తున్నారని రామోజీరావు ఆరోపించారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని నోరుజారి… సమాజం నుంచి చీవాట్లు తిన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనకు కేవలం ఒక్క రోజు ముందు… 2018, డిసెంబర్ 31న మార్గదర్శి చిట్‌ఫండ్ కేసును సింగిల్ బెంచ్ కొట్టేసింది. ఈ విషయం చాలా కాలానికి తనకు తెలిసినట్టు ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడది కొనసాగుతోంది. 2016లో రామోజీకి దేశంలోనే అత్యు న్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దీన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. ఆర్థిక, సివిల్ నేరాల్లో నిందితుడైన రామోజీకి పద్మవిభూషణ్ పురస్కారం ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ నేరం రామోజీపై శాశ్వతంగా మచ్చగా మిగిలిపోతుందని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
ఆర్థిక నేరాల్లో నిందితుడైన రామోజీరావు ఒక మీడియా సంస్థకు అధిపతిగా కొనసాగడం మాత్రం నైతికత, విలువల పరిధిలోకి వస్తుంది. ఇదే తనకు గిట్టని ప్రభుత్వంలో ఒకాయన మంత్రిగా కొనసాగితే మాత్రం నైతికతను ప్రశ్నించడం ఆయనకే చెల్లిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇదే ప్రశ్న ఓ సాధారణ ఓటరు, పౌరుడు ప్రశ్నిస్తే ఎంతో విలువ వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల రామోజీని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే… ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ డబ్బును వేరే సంస్థల్లోకి మళ్లించడం, వేలాది కోట్ల రూపాయలు వేరొక అకౌంట్‌కు తరలించడం ఆర్థిక నేరం. రామోజీరావు వైట్‌కాలర్ క్రిమినల్. ఆర్థిక నేరగాడు కాబట్టే ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా అతిపెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నాడు’
రామోజీని సమాజం చూస్తున్న రెండో కోణం ఇది. ఈ పెద్దాయన కూడా నైతికత, విలువల గురించి మాట్లాడితే, ఎదుటి వాళ్లు ఊరుకుంటారా? బండకేసి చాకిరేవు పెట్టరా? జీవిత చరమాంకంలో చంద్రబాబు కోసం ఎన్నెన్ని గిమ్మిక్కులు? ఎన్నెన్ని తిట్టు తినాల్సి వస్తోందా కదా? నైతికత, విలువలు వదిలేసిన వాళ్లు, వాటి విషయమై ఇతరులను ప్రశ్నిస్తే చివరికి తమ బాగోతం కూడా బజారున పడుతుందని గ్రహిస్తే మంచిది.