ఏదైనా ఛండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్న మా చిన్నపుడు అడుక్కుతిన్నట్టుంది అనేవాళ్లం. సినిమా ఎలా ఉంది అని అడిగితే అడుక్కుతిన్నట్టుంది అనేవారు, వాచ్యార్థం అతక్కపోయినా. కానీ యిప్పుడు ఆంధ్ర పరిస్థితి గురించి చెప్పేటప్పుడు వాచ్యార్థం కూడా సరిగ్గా సరిపోతుంది. కేంద్రం నుంచి అడుక్కుని తింటోంది రాష్ట్రం. గతంలో బాబు హయాంలో ‘ఆపసోపాంధ్ర’ జగన్ హయాంలో ‘అప్పుతిప్పలాంధ్ర’ అని కాప్షన్లు పెడితే కొందరు పాఠకులు నొచ్చుకున్నారు. ఇప్పుడు దీనికీ బాధపడవచ్చు కానీ యథార్థ పరిస్థితిని యింతకంటె చక్కగా ఏ పదబంధమూ వర్ణించలేదు.
అప్పు చేసి, అడుక్కుని తెచ్చి చేస్తున్నదేమిటయ్యా అంటే పప్పుబెల్లాలు పంచిపెట్టడం. కొత్త పథకాల జోరు తగ్గటం లేదు. కొత్త పథకం పెట్టినప్పుడు ఫుల్ పేజి యాడ్స్ యిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ పాత పథకాల ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేసినప్పుడల్లా యాడ్స్ యివ్వడం చూస్తే మతి పోతోంది. అసలా పథకాల గురించి ప్రకటనలు అవసరమా? వైసిపి వాళ్లు వాటి గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడడానికి ఏమైనా ఉందా? నిజమే పథకాలుండాలి, కానీ అవి ప్రోడక్టివిటీని పెంచాలి. చేయూత నిచ్చి సొంతకాళ్ల మీద నిలబడేట్లా చేస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ఎల్లకాలం భుజాలెక్కించుకుని తిప్పుతాం అంటే ఎలా? వైసిపి పథకాల్లో మంచివి చాలా ఉన్నాయి. విద్య, వైద్యం గురించి పెట్టే ఖర్చు అవసరమే, దీర్ఘకాలిక ప్రయోజనాలను కల్పిస్తుంది. కానీ అన్నీ ఒక్కసారే తలపెడితే నిభాయించుకోవడం ఎలా? సిరిగలవానికి చెల్లును.. అన్నట్లు, ధనిక రాష్ట్రాలు పథకాలు పెట్టినా ఫర్వాలేదు. కానీ ఆదాయమార్గాలు లేని రాష్ట్రం యిలా సంక్షేమపు ఊబిలో దిగబడితే ఎలా?
వైసిపి ప్రభుత్వంలో ఆర్థికమంత్రి పరిస్థితి అత్యంత క్లిష్టమైనది. అన్నీ సర్దుకురావడానికి ఆయనకు తలప్రాణం తోక కొస్తోంది. బజెట్‌లో పథకాల నిష్పత్తి తగుమాత్రంగా మేన్‌టేన్ చేస్తూ తక్కినవాటికీ నిధులు కేటాయిస్తే పేచీ లేదు. కానీ ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు, రోడ్లు బాగు చేయించరు, మౌలిక సదుపాయాలకు డబ్బు సమకూర్చరు. ఇదేం దిక్కుమాలిన పాలన? సమాజంలో ఒక్క వర్గాన్ని నమ్ముకుని తక్కిన వర్గాలను గాలికి వదిలేసి, రెచ్చగొడితే ఎలా? ఉద్యోగులకు జీతాలు యివ్వరు కానీ సలహాదారులను జీతాలిచ్చి పెట్టుకోవాలా? ఇంతమంది సలహాదారుల్లో ఒక్కరూ ‘ఉద్యోగులకు జీతాలివ్వండి, వాళ్లే మన ప్రభుత్వానికి కరచరణాలు, అవి చచ్చుబడి సంక్షేమాల బాన పొట్ట వేసుకుని తిరిగితే అడుగు ముందుకు పడదు’ అని చెప్పినవారు లేరా? చెప్పినా వినేవారు లేరా?
ఇంతమందిని క్షోభపెట్టి సాధిస్తున్నదేమిటి? పథకాలు అందుకునే శాతం తక్కినవారి కంటె ఎక్కువ ఉంది కాబట్టి గెలుపు ఖాయం అని ధైర్యమా? పథకాలు తీసుకున్నవారిలో అధికార పార్టీకి ఓటేసినవారు 35 శాతమే అని మునుగోడు చెప్పింది. ఎందుకంటే యివి జగన్ యింట్లోంచి డబ్బు తెచ్చి యివ్వటం లేదని అందరికీ తెలుసు. మా డబ్బు మాకిస్తున్నారు, దీనికై ఎవరికీ మొహమాట పడవలసిన అవసరం లేదు అని ప్రజల భావన. జగన్‌ను ఓడించినా తర్వాతి వచ్చేవాళ్లు కూడా పథకాలను ఆపలేరనే ధీమా ఉంది. అందువలన పాలన బాగుంటే ఓటేస్తారు, లేకపోతే మానేస్తారు తప్ప కేవలం పథకాలే జగన్‌ను గట్టెక్కించవు. పాలన బాగుందనిపించుకోవాలంటే సమాజంలో అన్ని వర్గాలూ ఏదో ఒక మేరకు సంతృప్తి చెందాలి. ఈ అవగాహన జగన్‌కు లేకుండా ఉంది.
ఈ పథకాలలో ఉన్న పెద్ద చిక్కేమిటంటే, లక్ష్యం నెరవేరుతోందో లేదో తెలియటం లేదు. గతంలో అయితే లబ్ధిదారులకు వస్తురూపంలో అందచేసేవారు. అయితే ఆ క్రమంలో చాలా అవినీతి జరిగేది. డెలివరీ సిస్టమ్ నిర్వహణ ఖర్చులుండేవి. అందుకని నగదు బదిలీ పథకం అనేది వచ్చింది. దీనిలో డిజిటల్‌గా లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా డబ్బు చేరుతోంది కాబట్టి, లబ్ధిదారుడు సంతోషిస్తున్నాడు. లబ్ధిదారుడి ఎంపికలో అవినీతి, వివక్షత ఉండవచ్చేమో కానీ నిధుల బదిలీలో అవినీతికి ఆస్కారం లేదు. అంతవరకు బాగానే ఉంది కానీ నిధులు చేతికి వచ్చాక అతను ఉద్దేశించిన వస్తువులు కొంటున్నాడో, యితరత్రా దుబారా చేస్తున్నాడో తెలియటం లేదు.
సంక్రాంతి సమయంలో అమ్మ ఒడి నిధులు విడుదల కాగానే బట్టల కొట్లు, నగల దుకాణాలు కళకళలాడేయని వార్తలు వచ్చాయి. ఆ డబ్బేదో స్కూలు వాళ్ల ఖాతాలో పిల్లవాడి పేర వేస్తే సద్వినియోగం అయిందని కచ్చితంగా తెలుస్తుంది. కానీ ఆ పని చేయాలంటే ప్రభుత్వాధికారులు శ్రమ పడాలి, పర్యవేక్షించాలి. ఎందుకొచ్చిన తలకాయనొప్పి అని డబ్బు పంపేస్తున్నారు. అది పెట్టి బట్టలు కొంటున్నారో, బాటిల్సు కొంటున్నారో వీళ్ల కనవసరం. 2009 ఎన్నికల సమయంలో లోకేశ్ సూచన మేరకు టిడిపి నగదు బదిలీ పథకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టినపుడు విదేశాల్లో దాని అమలు గురించి చదివాను. అవి తాత్కాలికంగానే, ఒకటి రెండేళ్లు పెట్టి, ఆ తర్వాత ఆపేస్తారట. మన దగ్గర మొదలుపెట్టడమే తప్ప ఆపడం ఉండదు. ఇదో పులిస్వారీగా మారుతుంది.
వైసిపి కూడా పథకాలు మొదలుపెట్టిన తర్వాత చెక్ చేయడం మొదలుపెట్టింది. కారున్నవాళ్ల. ఇల్లున్నవాళ్ల పేర్లు జాబితాలోంచి కొట్టేస్తామంటూ, కొందరివి తీసేశారు కూడా. పట్టణాల్లో అయితే అర్హులకు మాత్రమే యివ్వడం కుదురుతుంది. గ్రామాల్లో అలాక్కాదు. మోతుబరి, భూస్వామి కూడా ‘ఏయ్, నాక్కూడా ఆరోగ్యశ్రీ కార్డోటి ఇయ్యి, రేషన్ కార్డూ ఇయ్యి, పడుంటుంది’ అంటే ‘రూల్సు ఒప్పుకోవు’ అనడానికి ప్రభుత్వోద్యోగికి దమ్ము చాలదు. ఇలా పథకాలు అక్కరలేనివాళ్లు కూడా జాబితాలో చేరిపోతారు. వీళ్ల పేర్లు తీసేయడానికి తెగువ ఉండాలి. ఏ ప్రభుత్వమైనా ఆ పని చేస్తే హర్షించాలి, ప్రజాధనం ఆ మేరకు రక్షింపబడుతోంది కాబట్టి.
కానీ ప్రతిపక్ష నాయకులు అలా అనుకోరు. ఇచ్చినట్టే యిచ్చి వెనక్కి లాగేసుకుంటున్నారు అంటూ యాగీ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు, పెన్షన్లు ఆపేసినవారందరికీ పునరుద్ధరిస్తారట, పాత బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తారట. తన రైతు ఋణమాఫీ పథకంలో పరిమితులు పెట్టి, రైడర్స్ చేర్చి, భారం తగ్గించుకున్నపుడు యిలా ఆలోచించలేదెందుకో! మితిమీరిన పథకాల ద్వారా జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశాడని విమర్శిస్తూనే తాము అధికారంలోకి వస్తే యీ పథకాలను ఎత్తివేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని, అప్పులిక తేమని చెప్పటం లేదు. పథకాలు కొనసాగిస్తారట, ఇంకా మెరుగ్గా, యింకా ఎక్కువగా యిస్తారట. ఇప్పుడున్న అప్పులకు వడ్డీలు కట్టాలి, పథకాలు కొనసాగించాలి, జీతాలివ్వాలి, పెన్షన్లివ్వాలి.. వీటన్నిటికీ డబ్బెక్కణ్నుంచి వస్తుంది? అందువలన రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర దేహీ అంటూ దేబిరించ వలసిందే!
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే వీటన్నిటితో బాటూ అమరావతి గుదిబండ ఒకటి తగులుకుంటుంది. ఎందుకంటే ఆయన్ని చూసే రైతులు 33 వేల ఎకరాల భూమి యిచ్చారు. ‘మీరు డెవలప్ చేసి యిస్తానన్నారు. చేయకుండా మొండికేసిన జగన్ని దింపేసి మళ్లీ మీకు అధికారం అప్పగించాం. ఓ ఆర్నెల్లలో చేసి యిచ్చేయమని హైకోర్టు కూడా చెప్పింది. మీరైతే యింకా త్వరగా యివ్వగలరని మా నమ్మకం.’ అంటారు వాళ్లు. గతంలో అయితే సింగపూరు వ్యాపారస్తులు డెవలప్ చేస్తామంటూ ఊగిసలాడారు. ఇప్పుడు ‘ఇది దశాబ్దాలు పట్టే ప్రాజెక్టు. మీ తర్వాత వచ్చేవాళ్లు ఒప్పందాల్ని మన్నిస్తారో, తోసిరాజంటారో తెలియదు’ అంటూ దీర్ఘాలు తీస్తారు. కేంద్రం సహాయనిరాకరణ వైఖరి స్పష్టంగా తెలిసిపోతోంది. నవనగరాల్లో నాలుగు నగరాలైనా కట్టకపోతే బాబు ఆబోరు దక్కదు. అందుకని బజెట్‌లో ఎంతో కొంత దానికి కేటాయించాల్సిందే.
జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అమరావతిపై ఫోకస్ తగ్గించి తక్కిన ప్రాంతాల్లో ఆశలు పెంచాడు. ఆచరణలో మాత్రం చేస్తున్నదేమీ కనబడటం లేదు. ఎంతసేపూ వైజాగ్ లోనే మొత్తం పెడుతున్నట్లు కనబడుతోంది. బాబుకి అమరావతిలాగ జగన్‌కు వైజాగ్ మేనియా పట్టింది. కొత్తగా పెద్దగా ఏమీ కట్టకపోయినా వైజాగ్‌ని ఏదో రకంగా పెద్దది చేసేసి తన ఖాతాలో వేసేసుకుని హైదరాబాదుకి దీటైన నగరాన్ని ఆంధ్రకు అమర్చామని చెప్పుకోవాలని ఐడియా. హైదరాబాదు సిండ్రోమ్ వదలనంత వరకు ఆంధ్ర బాగుపడదని నా నిశ్చితాభిప్రాయం. హైదరాబాదులో అన్నీ కేంద్రీకరించడం వలన అనర్థం జరిగింది తప్ప మేలు జరగలేదు. ఇప్పటికీ తెలంగాణలో చెప్పుకోదగ్గది హైదరాబాదు మాత్రమే. అన్నీ యిక్కడే. ఉపాధికై అన్ని జిల్లాల నుంచి నగరానికే రావలసి వస్తోంది. నగరజీవనం అస్తవ్యస్తం, రోడ్లు, సివిక్ ఎమినిటీస్ అధ్వాన్నం, ట్రాఫిక్ ఘోరాతిఘోరం.
బాబు అధికారంలోకి వచ్చి అమరావతి పని మొదలుపెట్టగానే, తక్కిన జిల్లాలన్నీ మా మాటేమని పట్టుకుంటాయి. అందుకని అక్కడా ఎంతోకొంత చేయాల్సి వస్తుంది. దానికీ బజెట్‌లో కేటాయింపులు కావాలి. ఇవన్నీ గుర్తు చేసి బాబును నిధులెక్కణ్నించి తెస్తారు స్వామీ అని అడిగితే అమరావతి కడితే గుడ్లు పెట్టేస్తుంది అని చెప్తారు. బాతును సృష్టించాక గుడ్లు పెడితే పెట్టవచ్చు. సృష్టించడం ఎలా అన్నదే ప్రశ్న. అప్పుడు చేయలేక పోయారు పోనీ యిప్పుడైనా చెప్పమను, నిధులు ఎక్కణ్నుంచి వస్తాయో! బాబు, జగన్ ఎవళ్లపాటికి వాళ్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారు. ఇప్పుడు బ్రహ్మాండమైన అమరావతి కడతానంటే డబ్బెవరిస్తారు?
వీళ్లిద్దరి వరసా యిలా ఉంటే పవన్ కళ్యాణూ ఏమంత మెరుగ్గా లేడు. అసలాయనేం మాట్లాడతాడో అర్థం కాదు. సినిమాను, బయటి జీవితాన్ని కలిపి కలగాపులగం చేస్తున్నట్లు కనబడుతోంది. గబ్బర్ సింగ్ వేషాలు సినిమాలో చెల్లుతాయి. తుపాకీ ఎడాపెడా కాల్చేసినా, కబడ్డీ పేరు చెప్పి బెల్టు తీసి బాదినా ప్రేక్షకులు హర్షిస్తారు. కానీ రోడ్డు మీద ప్రమాదకరంగా ప్రయాణిస్తే కేసులు పడతాయి. ఎన్టీయార్ ఖాకీ డ్రెస్సులో ప్రచారం చేశారు కదా, ఆయన కంటె ఓ మెట్టు ఎక్కువగా చేయాలని మిలటరీ డ్రస్సు వేయబోయేట్లున్నారు. దానికి తగ్గట్టుగా మిలటరీ వాహనం తరహాలో ఒకటి తయారు చేయించారు. ముందూ వెనకా కవాతు ఒకటి. ఇవన్నీ చూడడానికి వేడుకగా ఉంటాయి తప్ప ఓటర్లు వాహనం చూసి ఓట్లేయరు, ఎన్టీయార్ తర్వాత చాలామంది చైతన్యరథాల్లాటివి ఎక్కారు, నెగ్గారా? పవన్ ఆలోచనల్లో క్లారిటీ తెచ్చుకుని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పినప్పుడే, యాక్షన్ ప్లాను ఏమిటో వివరించినప్పుడే ప్రజలు చేరువౌతారు.
ఇంతమాత్రం ఆలోచించకుండా వైసిపి వాళ్లు వాహనం రంగు గురించి హడావుడి చేస్తున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ తమ పార్టీ రంగులు పూసేసి, ప్రజాధనాన్ని ఊదేసిన వైసిపి వాళ్లకు రంగుల గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ వాహనం రంగు ఆలివ్ గ్రీనా, ఎమరాల్డ్ గ్రీనా అన్నది ఫోటో చూసి తేల్చేయగలరా? ఫోటోల్లో, ప్రింటులో రంగులు వేరేలా కనబడుతూ ఉంటాయి. తెలంగాణ రవాణా అధికారులు మా కంటికి అది ఎమరాల్డ్ గ్రీన్‌లానే కనబడుతోందని అంటే ఆంధ్ర అధికారులు ఏం చేయగలరు? ఫోరెన్సిక్ నిపుణులకు పంపిస్తారా? దీని గురించి రచ్చ చేయడం పవన్‌కే లాభం చేకూరుస్తుంది. బాబు ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో జగన్ గురించి తెగ మాట్లాడి, ప్రజలు జగన్ని మర్చిపోకుండా చేశారు. ఇప్పుడు వైసిపి పవన్ గురించి అలాగే మాట్లాడుతోంది. రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయకుడి గురించి, 175 సీట్లలో ఒకే ఒక్క సీటు గెలిచిన పార్టీ గురించి మాట్లాడడం ఎంత దండగమారి పని! ఇలా మాట్లాడి, మాట్లాడి అతనో పెద్ద నాయకుడనే భ్రమ కల్పిస్తున్నారు వైసిపి వాళ్లు.
రాష్ట్రం యిలా నానాటికీ దిగజారి పోతూ ఉంటే కేంద్రంలోని బిజెపి ఏం చేస్తున్నట్లు? జగన్‌ను నియంత్రించి, రాష్ట్రాన్ని కాపాడాలని ఎందుకనుకోవటం లేదు? వాళ్ల ఆలోచన ఏమిటి? ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ (1962)లో ఓ దృశ్యం గుర్తుకు వస్తుంది. దానిలో విలన్ ఒక అమ్మాయిమీద కన్నేసి, ఆమె తండ్రికి తాగుడు మప్పుతాడు. చివరకు ఓ సీసాలోంచి మద్యం చుక్కచుక్క రాలుస్తూ సీసాని మెట్ల మీదుగా దొర్లిస్తాడు. అమ్మాయి తండ్రి ఆత్రంగా మెట్లు దిగి, సీసా రోడ్డు మీదకు దొర్లిపోతే, దాని కోసం పరిగెట్టుకెళ్లి లారీ కింద పడి చచ్చిపోతాడు. అలాగే కేంద్ర బిజెపి ఆంధ్ర అనే అమ్మాయి మీద కన్నేసి, జగన్‌కు అప్పు అనే మద్యం మప్పింది. మేం పోస్తూ ఉంటాం, నిన్నేమీ అనం అని ప్రోత్సహిస్తూ పోతోంది. జగన్ దానికి వశుడై చివరకు పదవీభ్రష్టుడు కావచ్చు. ప్రజలు ‘బాబు పాలన చూశాం, జగన్ పాలన చూశాం, యిద్దరూ వద్దు, యిక బిజెపి ఏం చేస్తుందో చూద్దాం’ అని 2024 నాటికే అనుకోవచ్చు.
ఈ పోలిక దారుణంగా ఉందని ఎవరైనా అనుకుంటే వారికి నేను విజయసాయి ఉదంతం గుర్తు చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి విజయసాయికి ఉన్నంత వాచాలత ఎవరికీ లేదు. ఇంత అసభ్యంగా మాట్లాడే వ్యక్తి పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడా అంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. అలాటివాడిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పానెల్ నుంచి జాబితాలోంచి తప్పించారంటే బిజెపి వైసిపికి పరోక్షంగానైనా బుద్ధి చెప్పిందని సంతోషించాను. కానీ ఆ ఆనందం తాత్కాలికమే. ఇప్పుడు ఆయన్ని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా వేశారు. తగునా? ఆయన యింకా రెచ్చిపోడా? ఇలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి, చివరకు ప్రజలు ఛీత్కరించేట్లు చేయడమే వారి ప్లానేమో! ఆ ఛీత్కరింపు విజయసాయితో ఆగిపోదు. ఆయన్ని అదుపు చేయని జగన్‌పై కూడా ప్రసరిస్తుంది. బహుశా బిజెపికి కావలసినది అదే!