టాలీవుడ్ లో అందగాడు అని పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి వుండలేదు ఇప్పటి వరకు. అలాంటిది యాభై ఏటకు దగ్గర అవుతున్న నిర్మాత దిల్ రాజు ఇచ్చారు ఇలాంటి స్టేట్ మెంట్. తాను అందంగా వున్నాననే తన మీద అంతా విమర్శలు కురిపిస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు దిల్ రాజు. చిత్రమే కదా.
దిల్ రాజు పలువురు డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఆంధ్ర అంతటా థియేటర్లను కంట్రోలు చేయడం ఏమిటి? గతంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమా రాకూడదు అని చెప్పిన ఆయనే ఇప్పుడు ఓ డబ్బింగ్ సినిమాను బడా సినిమాలతో సమానంగా విడుదల చేయడం ఏమిటి? ఇప్పుడు చెబుతున్న ఈ ‘బ్యూటిఫుల్’ థియరీ ఏమిటి?
దిల్ రాజుకు ఓ సమస్య వుంది. అదేమిటంటే తాను అనుకున్నది చటుక్కున అలాగే మాట్లాడేయడం. దానికి పాలిష్ వుండదు. సుగర్ కోట్ వుండదు. గతంలో చాలా సార్లు సినిమా వేదికల మీద కూడా ఇలాగే మాట్లాడేసారు. అప్పట్లో కొందరు హీరోలు నొచ్చుకున్నారు కూడా. ఇప్పుడు కూడా అలాగే అజిత్ కన్నా హీరో విజయ్ హీరో అని స్టేట్ మెంట్ ఇచ్చేసారు. అసలే తమిళనాట అజిత్ ఫ్యాన్స్ కు విజయ్ ఫ్యాన్స్ కు ఉప్పు నిప్పు అన్నట్లు వుంటుంది. ఇప్పుడు దిల్ రాజు స్టేట్ మెంట్ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.
అసలు సమస్యను దిల్ రాజు పక్కదారి పట్టిద్దాం అని చూస్తున్నారు. తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని, తన మీద రాస్తేనే జనం చదువుతారని, అందుకే తనపై రాస్తున్నారనే భావనతో వున్నారు. అంతే తప్ప టాలీవుడ్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో? ఎవరేం ఫీలవుతున్నారో అర్థం చేసుకోవడం లేదు.