ఏపీ రాజధాని అమరావతిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసి తీరి పొడిచారు. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయం సుస్పష్టం. పరిపాలన రాజధాని అమరావతిలో ఎట్టి పరిస్థితిలో వుండకూదనేది జగన్ ప్రభుత్వ నిశ్చితాభిప్రాయం. ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లులను తీసుకొచ్చి…. రేపటికి మూడేళ్లవుతుంది. ఈ సందర్భంగా అమరావతినే ఏకైక రాజధానిగా వుండాలనే డిమాండ్‌పై జేఏసీ ఓ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ దఫా వేదికగా ఢిల్లీని ఎంచుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో అమరావతి సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లాలనే వారి కోరికను గౌరవించాల్సిందే. ఇందులో భాగంగా విజయవాడ నుంచి 1600 మంది ఢిల్లీకి రైల్లో బయల్దేరారు. ఈ రైలు యాత్రకు పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు మాత్రమే సంఘీభావం తెలపడాన్ని గమనించొచ్చు.
అమరావతి ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ ఎందుకు సంఘీభావం తెలపలేదనే ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయంగా తమకు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆ 29 గ్రామాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో నష్టం వస్తుందనే భయంతో అమరావతికి టీడీపీ దూరంగా వుందనేది ఈ ఎపిసోడ్‌తో స్పష్టమైంది. ఎవరినైనా, దేన్నైనా చంద్రబాబు వాడుకుని వదిలేస్తారనే పేరుంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ, రైలు యాత్రకు కనీసం సంఘీభావం తెలపడానికి కూడా తమ నేతల్ని చంద్రబాబు పంపలేదు.
మొదటి నుంచి చంద్రబాబును నమ్ముకుని అమరావతి రాజధాని అంటూ కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి ఆర్థిక, హార్థిక సాయం నిలిచిపోవడంతో అమరావతి ఉద్యమం అటకెక్కింది. అమరావతి పోరాటంలోని డొల్లతనాన్ని చంద్రబాబు బయట పెట్టినట్టైంది. అమరావతి కథ ఇక కంచికే అని అంటున్నారు. కుక్క తోక పట్టుకని గోదారి ఈదేందుకు ప్రయత్నించిన చందంగా… చంద్రబాబును నమ్ముకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అమరావతి పరిరక్షణ సమితి నేతలు వాపోతున్నారు. మొత్తానికి బాబు వెన్నుపోటు బాధిత జాబితాలో అమరావతికి చోటు దక్కడం విశేషం.