ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఇంత మార్పా…. ఏంటబ్బా అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. నాయకులు తాము చెప్పడానికే తప్ప, వినడానికి సహజంగా ఇష్టపడరు. ఇందుకు వైఎస్ జగన్ అతీతుడు కాదు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తల్ని పిలిపించుకుని, క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఓ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. మొట్టమొదట కుప్పం నుంచే ఇది మొదలైంది.
అయితే కార్యకర్తల అభిప్రాయాల్ని తెలుసుకోవడం కంటే, తాను ఉపన్యాసం ఇవ్వడానికే జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరం కార్యకర్తల సమావేశంలో మాత్రం జగన్ భిన్నంగా వ్యవహరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మైలవరంలో మంత్రి జోగి రమేశ్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మైలవరం కార్యకర్తలతో దాదాపు మూడు గంటల పాటు జగన్ సమావేశం కావడం గమనార్హం. 15 నిమిషాల పాటు జగన్ దిశానిర్దేశం చేయడం మినహాయిస్తే, మిగిలిన సమయం అంతా కార్యకర్తల అభిప్రాయాల్ని వినడానికే ఆయన ఆసక్తి కనబరిచారనే వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మైలవరం నియోజకవర్గంలో అతిగా జోక్యం చేసుకోవడం మొదలుకుని, పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనం లేదనే వరకూ గోడు వినిపించినట్టు సమాచారం.
జగన్ తమ సమస్యల్ని పరిష్కరించే సంగతి పక్కన పెడితే, కనీసం విన్నారనే సంతృప్తి మిగిలిందని కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు కోరుకున్న మార్పు. రానున్న రోజుల్లో కార్యకర్తల మనోభావాలను వినడానికి జగన్ సమయం కేటాయిస్తే, వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం వుంటుందని అంటున్నారు. ప్రస్తుతం జగన్‌లో వచ్చిన మార్పుపై వైసీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి.