తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవికి ఇప్పట్లో మనశ్శాంతి దక్కేలా లేదు. ఇన్నళ్లూ తనకు పక్కలో బల్లెంలాగా మారిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావడంతో.. తనకు బెడద తప్పిందని శ్రీదేవి మురిసిపోయారు. అయితే ఆ మురిసిపాటు పూర్తిగా అనుభవంలోకి రాకముందే, ముఖ్యమంత్రి జగన్ ఆమె మెడ మీద మరో కత్తిని వేలాడదీశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా వివాదాస్పద బిషప్ కత్తెర సురేష్ కుమార్ ను నియమించారు. ఆయన భార్య క్రిస్టినా ప్రస్తుతం గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ కూడా!
తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవికి ఇంకా నిద్రలేని రాత్రులు కొనసాగబోతున్నాయి. శ్రీదేవి ఎమ్మెల్యే అయిన నాటినుంచి నేటిదాకా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్నారు. పేకాట క్లబ్ ల నిర్వహణ, ఇసుక దందాలు ఇలాంటి అనేకానేక అక్రమ వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పోలీసు అధికార్లను నానా బూతులు తిడుతూ.. అత్యంత చండాలంగా మాట్లాడుతూ ఆమె నోరు పారేసుకున్న ఆడియో రికార్డింగులు కూడా బయటకు వచ్చాయి. పార్టీలో కూడా అధిష్ఠానం పట్ల ధిక్కారంతో ఆమె వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇలాంటి నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నప్పటికీ.. పార్టీ తరఫున అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను జగన్ నియమించారు. అప్పటినుంచి శ్రీదేవి మరింత ఇబ్బందికి గురైంది. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి డొక్కా పోటీచేస్తారనే ప్రచారం బాగా జరగడంతో.. స్థానికంగా వారిద్దరి వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. శ్రీదేవి పార్టీ సొంత నాయకులతో కూడా బహిరంగంగానే తగాదా పెట్టుకుంటారనే ప్రచారం కూడా ఉంది. ఈ విభేదాలు ఇలా ఉండగానే.. డొక్కాను జిల్లా అధ్యక్షుడు చేసేశారు.
గుంటూరు జిల్లా మొత్తం పార్టీని మళ్లీ గెలిపించే బాధ్యత తీసుకుంటానని, జగన్ ఆదేశిస్తే గుంటూరు, విజయవాడ జిల్లాల్లో ఎక్కడినుంచైనా పోటీకి దిగుతానని, జనరల్ నియోజకవర్గాల్లో అయినా తాను పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ సందర్భంగా ప్రకటించారు. ఆయన జిల్లా పదవిలోకి వెళ్లిపోయారు గనుక.. తనకు తాడికొండ నియోజకవర్గంలో ఇక ఎదురులేదేని శ్రీదేవి భావించారు. రోజుల వ్యవధిలోనే ఆమె సంతోషాన్ని ఆవిరి చేసేస్తూ జగన్ కొత్త నియామకం ప్రకటించారు.
బిషప్ కత్తెర సురేష్ కుమార్ ను తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఆయన భార్య క్రిస్టినా ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్ కూడా. హార్వెస్ట్ ఇండియా సొసైటీ అనే సంస్థకు సురేష్ కుమార్ అధ్యక్షుడు. ఈ సంస్థ ముసుగులో ఎఫ్సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందుతూ అక్రమాలకు పాల్పడ్డారని గతంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సంస్థ అనుమతులు కూడా రద్దు చేశారు. అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వివాదాస్పద బిషప్ గా ఆయన ముద్రపడ్డారు. ఆయనను ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు.