నిమ్మ‌గ‌డ్డపై ప్ర‌భుత్వ మ‌న‌సులో ఏముంది?

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను జ‌గ‌న్ స‌ర్కార్ అయిష్టంగానైనా నియ‌మించింది. రెండు రోజుల క్రితం ఆయ‌న విజ‌య‌వాడ‌లో బాధ్య‌త‌లు కూడా తీసుకున్నారు. త‌న నియామ కానికి…

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను జ‌గ‌న్ స‌ర్కార్ అయిష్టంగానైనా నియ‌మించింది. రెండు రోజుల క్రితం ఆయ‌న విజ‌య‌వాడ‌లో బాధ్య‌త‌లు కూడా తీసుకున్నారు. త‌న నియామ కానికి సంబంధించిన అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం కూడా పంపారు. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మ‌ధ్య‌లోనే ఆయన నిలిపేశారు.

వాయిదా ప‌డిన ఎన్నిక‌ల‌ను తిరిగి నిర్వ‌హించేందుకు ఆయ‌న క‌స‌రత్తు ప్రారంభించారు. గ‌తంలో మాదిరిగానే త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం అందుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించి స్నేహ హ‌స్తాన్ని చాచారు. ఇటు నిమ్మ‌గ‌డ్డ‌, అటు ప్ర‌భుత్వ మ‌న‌సుల్లో ప‌ర‌స్ప‌రం ఎలాంటి అభిప్రాయాలున్నా….ప్ర‌స్తుతానికి సాఫీగా స్టార్ట్ అయిందనే చెప్పాలి.

గ‌త నాలుగు నెల‌ల్లో నిమ్మ‌గ‌డ్డ‌, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిణామాలు పీడ‌క‌ల‌లా సాగిపోయాయి. వాట‌న్నింటిని తిరిగి మ‌న‌సులో పెట్టుకుని ఇద్ద‌రూ ఎవ‌రికి వారు క‌క్ష‌గా వ్య‌వ‌హ‌రిస్తారా?  లేక హూందాగా ప్ర‌వ‌ర్తించి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌కు మం చి పేరు తీసుకొస్తారా అనే ప్ర‌శ్న‌లు భ‌విష్య‌త్‌లో వారు వ్య‌వ‌హ‌రించే తీరే స‌మాధానం ఇస్తుంది. అయితే నిమ్మ‌గ‌డ్డ ప‌ట్ల ప్ర‌భుత్వ వైఖ‌రి తెలియ‌డానికి ప‌రీక్ష చేసేందుకు అన్న‌ట్టు ఆర్థిక అంశం ముందుకొచ్చింది.

ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని, కావున త‌మ‌కు రూ.40 లక్ష‌లు విడుద‌ల చేసి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ఆర్థిక‌శాఖ‌కు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎస్ఈసీ హోదాలో లేఖ రాశారు. నిజానికి ఇప్పుడు రాసిన మ‌రోసారి గుర్తు చేసేదే. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కోసం రూ.40 ల‌క్ష‌ల‌ను ప్ర‌త్యేక గ్రాంట్‌గా ఇవ్వాల‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఆర్థిక‌శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ పంపారు.

అప్ప‌టి నుంచి ఆ ఫైల్ ఆర్థిక‌శాఖ వ‌ద్ద పెండింగ్‌లో ఉంది. అంటే ఇప్ప‌టికి 8 నెల‌లుగా ఆ ఫైల్‌కు మోక్షం ల‌భించ‌లేదు. ఇక మార్చిలో ఎన్నిక‌ల వాయిదా….అనంత‌రం చోటు చేసుకున్న దుష్ప‌రిణామాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తిరిగి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిమ్మ‌గ‌డ్డ‌…స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ మనుగ‌డ‌లోనే ఉంద‌ని చెప్పారు.

ఈ ప్ర‌క్రియ కోసం ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థిస్తున్నారు. కోవిడ్ నేప‌థ్యంలో తిరిగి ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాలి? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి త‌దిత‌ర అంశాల‌పై ఉన్న‌త స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. త‌దుపరి చ‌ర్య‌ల‌పై నిమ్మ‌గ‌డ్డ చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్టు తానే తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కోసం ఏపీ స‌ర్కార్ నిధులు విడుద‌ల చేసి స‌హ‌క‌రిస్తుందా? లేక మ‌ళ్లీ కొత్త వివాదాన్ని కొని తెచ్చుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. అది ప్ర‌భుత్వం చేతుల్లోనే ఉంది.  అస‌లు స‌ర్కార్ మ‌న‌సులో ఏముందో మ‌రి?  

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే