‘మా’ వివాదం.. బ్లాక్ లిస్ట్ రెడీ చేసిన మెగా వర్గం?

“ఎన్నికల వరకు మాత్రమే పోటీ. ఆ తర్వాత అంతా ఒకటే. మాది సినీ కుటుంబం. మేమంతా కళామతల్లి ముద్దు బిడ్డలం.” కెమెరా కనిపిస్తే అంతా చెప్పే డైలాగులివే. కానీ అసలు వ్యవహారం దీనికి పూర్తి…

“ఎన్నికల వరకు మాత్రమే పోటీ. ఆ తర్వాత అంతా ఒకటే. మాది సినీ కుటుంబం. మేమంతా కళామతల్లి ముద్దు బిడ్డలం.” కెమెరా కనిపిస్తే అంతా చెప్పే డైలాగులివే. కానీ అసలు వ్యవహారం దీనికి పూర్తి విరుద్ధం. తాజా ఎన్నికలతో టాలీవుడ్ లో చీలిక స్పష్టంగా కనిపించింది.

ఎవరు ఏ కాంపౌండ్ అనే విషయంపై అందరికీ ఓ ఐడియా వచ్చేసింది. ఇకపై ఆయా నటీనటులకు అవకాశాలు కూడా వర్గాల వారీగానే వస్తాయి.

నరేష్ కు ఇక నో ఎంట్రీ

మొన్న ఎన్నికల్లో తనకుతాను కృష్ణుడి పాత్ర పోషించినట్టు చెప్పుకున్నాడు సీనియర్ నటుడు నరేష్. కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మాత్రం అతడ్ని శకునిగా అభివర్ణించింది. 2 నెలలుగా నరేష్ చేసిన హంగామా, దానికి నాగబాబు-ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్లు అంతా చూశాం. ఇవన్నీ ఒకెత్తయితే, తాజాగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ వర్గాన్ని ముండమోపి అనే పదంతో నరేష్ దూషించడం ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత కంపు చేసింది. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ లో నరేష్ కు పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు నరేష్. తండ్రి, మామయ్య, పెదనాన్న ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తున్నాడు. రామ్ చరణ్ నుంచి మొదలుపెడితే.. దాదాపు మెగా హీరోలందరితో సినిమాలు చేశాడు. ఇకపై నరేష్ కు అలాంటి అవకాశాలు రాకపోవచ్చు. రాబోయే రోజుల్లో మెగా హీరోల సినిమాల్లో ఈ నటుడు కనిపించే అవకాశాలు తక్కువే అంటున్నారు. దాదాపు మెగా హీరోలంతా నరేష్ పై అనధికారిక బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది.

నరేష్ ఒక్కడు మాత్రమే కాదు..

ఈ విషయంలో నరేష్ ఒక్కడే టార్గెట్ కాదు, మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్న సభ్యులతో పాటు.. అతడి వర్గానికి అనుకూలంగా ఉన్న చాలామంది నటులపై మెగా కాంపౌండ్ ఓ కన్నేసి ఉంచింది. రాబోయే రోజుల్లో వీళ్లందరికీ అవకాశాలు తగ్గబోతున్నాయి. 

శివబాలాజీ, 30 ఇయర్స్ పృధ్వి లాంటి నటులకు ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయాయి. కానీ నటుడిగా బిజీగా ఉన్న రఘుబాబుకు మెగా కాంపౌండ్ నుంచి అవకాశాలు వస్తాయా అనేది అనుమానం. ప్యానెల్ లో మిగతా సభ్యులకు ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయాయి. వాళ్లను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.

ప్రకాష్ రాజ్ పరిస్థితేంటి..?

అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ పరిస్థితి ఇలా లేదు. దాదాపు అంతా బిజీగా ఉన్న నటీనటులే కనిపిస్తున్నారు. వీళ్లను మోహన్ బాబు వర్గం టార్గెట్ చేస్తే మాత్రం కెరీర్ కు కష్టమే. ముందుగా ప్రకాష్ రాజ్ విషయానికొస్తే.. ఈ నటుడికి అటువైపు నుంచి సినిమా అవకాశాలు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఎలాగూ తమ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ను పెట్టుకోరు. కనీసం 2-3 ఏళ్ల వరకైనా దూరంగా ఉంచుతారు.మోహన్ బాబుకు మద్దతుగా నిలిచిన ఇతర హీరోల సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ కు అవకాశాలు తగ్గితే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ప్రకాష్ రాజ్ తో పాటు.. హేమ, ఉత్తేజ్, నాగినీడు, బ్రహ్మాజీ, సమీర్, ప్రగతి, అనసూయ లాంటి చాలామంది నటులు ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్తోకూస్తో బిజీగా ఉన్నారు. వీళ్లకు మోహన్ బాబు వర్గం నుంచి సినిమా ఛాన్సులు వస్తాయా అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం దొరకదు. కానీ ప్రభావం మాత్రం కచ్చితంగా పడే అవకాశం ఉంది.

పైకి కనిపించని విభజన రేఖ

టాలీవుడ్ నటీనటుల్లో పైకి కనిపించని విభజన రేఖ మాత్రం వచ్చేసింది. ఎప్పుడైతే సజావుగా జరగాల్సిన ఎన్నికల టైమ్ లో విష్ణు-ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు కొట్టుకున్నారో అప్పుడే చీలిక వచ్చేసింది. ఆ తర్వాత చిరంజీవి వ్యాఖ్యలు, మోహన్ బాబు ప్రతిస్పందనలు ఈ చీలికను మరింత పెద్దగా చేశాయి. ఈ వివాద ప్రభావం కచ్చితంగా నటీనటుల కెరీర్ల పై పడి తీరుతుంది. రాబోయే రోజుల్లో ఫలానా పాత్రను ప్రకాష్ రాజ్ తోనే చేయించాలంటూ, మోహన్ బాబు వర్గం దగ్గర.. ఫలానా పాత్రను నరేష్ చేస్తేనే బాగుంటుందంటూ మెగా కాంపౌండ్ దగ్గర దర్శకులు పట్టుబడితే అంతే సంగతులు.

అయితే ఎక్కువ ప్రభావం మాత్రం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు, ఆయన మద్దతుదారులపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇండస్ట్రీలో రెగ్యులర్ గా సినిమాలు తీసేది మెగా కాంపౌండ్ హీరోలు, నిర్మాతలే.