పేరుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. కానీ పక్కనున్న జిల్లాలో కూడా ఆయనకు పిలుపు ఉండదంటే బాధే మరి. శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద రాజకీయ కుటుంబం అంటే కింజరాపు వారిదే. అన్న ఎర్రన్నాయుడు మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రా సహా రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించారు.
ఆయన వారసుడిగా వచ్చిన అచ్చెన్నాయుడు మంత్రిగా అయిదేళ్ల పాటు పనిచేశారు, ఇపుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. చిత్రమేంటి అంటే విశాఖలో ఏ చిన్న విషయం జరిగినా పెదబాబో చినబాబో గబుక్కున దిగిపోతారు. అంతే తప్ప అచ్చెన్నాయుడుకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వరంటే ఇవ్వరని ప్రచారం సాగుతోంది.
తాజాగా చినబాబు లోకేష్ విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లిలో టీడీపీ నియోజకవర్గం పార్టీ ఆఫీస్ ప్రారంభానికి వస్తున్నారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి లోకేష్ రావాల, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కదా అంటే రావాల్సిందే అంటారేమో. ఎందుకంటే ఆయన కూడా పక్క రాష్ట్రం పోలేరు కదా. రాజకీయం చేయాల్సింది పూర్తిగా ఏపీలోనే కదా.
మొత్తానికి చూస్తూంటే అచ్చెన్నాయుడుకు కనీసం ఉత్తరాంధ్రాలో అయినా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఇవ్వరా అంటే టీడీపీలో అదే పద్ధతేమో అనుకోవాలి. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు పేరుకు ప్రెసిడెంట్ గా ఉన్నా పూర్తిగా శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అయిపోయారు అనేకంటే ఆయన్ని అలా బాబులిద్దరు ఉంచేశారు అనుకోవడం బెటరేమో అంటున్నారు రాజకీయ ప్రత్యర్ధులు.