cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: మహాసముద్రం

మూవీ రివ్యూ: మహాసముద్రం

టైటిల్: మహాసముద్రం
రేటింగ్: 2.5/5
తారాగణం:
శర్వానంద్, అదితి, సిద్ధార్థ్, అను ఇమాన్యువల్, జగపతిబాబు, రావు రమేష్, శరణ్య తదితరులు 
కెమెరా: రాజ్ తోట
ఎడిటింగ్: ప్రవీణ్ కె ఎల్ 
సంగీతం: చేతన్ భరద్వాజ్ 
నిర్మాత: అనిల్ సుంకర 
కథ-దర్శకత్వం: అజయ్ భూపతి 
విడుదల తేదీ: 14 అక్టోబర్ 2021

ఆరెక్స్ 100 లాంటి చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి దాదాపు మూడేళ్ల తర్వాత మహాసముద్రంతో మన ముందుకొచ్చాడు. ఈ సారి మల్టీస్టారర్ కథతో, "లోతైన" టైటిలుతో, బరువైన ట్రైలరుతో కొన్ని అంచనాలు ఏర్పరచాడు. 

హిట్ తీసిన దర్శకుడికి రెండో సినిమా గండం అనేది టాలీవుడ్ లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక సెంటిమెంట్. ఇంతకీ ఈ సినిమాతో అజయ్ ఆ గండాన్ని దాటాడో లేదో చూద్దాం. 

ఇద్దరు హీరోలతో సినిమా కథని రాసుకోవాల్సి వచ్చినప్పుడు దర్శకుడికి పెద్ద చాలెంజ్ ఒకటుంటుంది. రెండు పాత్రలూ బలంగా రాసుకోవడం..  తీసే క్రమంలో హీరోలకి ఇగోలు ఉంటే వాటిని మేనేజ్ చేసుకోవడం.. తీసాక ఆడియన్స్ కి కూడా ఇద్దరు హీరోల మధ్య బలమైన టగాఫ్ వార్ నడించిందన్న అనుభూతి కలిగించడం. 

ఇక్కడ మొదటి పాయింటులోనే తేడా వచ్చింది. ఇద్దరు హీరోల పాత్రలూ బలంగా లేవు. ఒకడు మంచివాడుగా మొదలై క్రిమినల్ గా మారతాడు.  ఇంకొకడు క్రిమినల్ ఆలోచనలతోనే ఉండి క్రిమినల్ గా మారతాడు. ఇక్కడే బ్యాలెన్స్ తప్పింది. 

అయినా పర్వాలేదు. సరైన పర్ఫార్మెర్స్ ఉంటే ఈ ఇంబ్యాలెన్స్ ని అధిగమించొచ్చు. కానీ ఆ పని జరగలేదు. 

శర్వానంద్ క్రిమినల్ గా మారినా మంచివాడిగానే కనిపిస్తాడు. ఇది అతని ఫేస్ వేల్యూ. ఎంత కష్టపడినా, కష్టపెట్టినా శర్వానంద్ నుంచి మంచితనం చెరిపేయలేం. స్వతహాగా మంచి పర్ఫార్మారే అయినా ఈ పాత్రకి శర్వా రాంగ్ క్యాస్టింగ్ అనిపిస్తుంది.

ఇక సిద్ధార్థ ఎంత మంచి నటుడో దానికి తగిన వైవిధ్యాన్ని ఆ పాత్రకి రాసుకోకపోవడం ఇంకొక పొరపాటు. మొదటి నుంచి చివరి వరకు ఒకటే గ్రాఫులో సాగే క్యారక్టర్ తనది. ఇక్కడ క్యాస్టింగ్ కరెక్టే అయినా రైటింగ్ రాంగ్ అనుకోవాలి. 

హీరోలిద్దరూ తనకు రెస్పెక్ట్ ఇచ్చి, చెప్పింది చెప్పినట్టు చేసారని అజయ్ భూపతి ప్రి రిలీజ్ వేడుకలో చెప్పాడు. ఆ రకంగా ఇద్దరి హీరోల ఇగోలని విజయవంతంగా మేనేజ్ చేయగలిగాడని మాత్రం అర్థమయింది. 

ఆడియన్స్ కి మాత్రం ఇద్దరి హీరోల మధ్య సమాంతర పోరాటాన్ని చూసిన అనుభూతి కలగలేదు. 

అజయ్ భూపతి తొలి సినిమాతో తనలోని ఇంటెన్సిటీని బయటపెట్టాడు. కానీ ఈ రెండో సినిమాలో ఆ ఇంటెన్సిటీ ఏమాత్రం కనపడలేదు. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడ్ ని నిలబెట్టడంలో తోడ్పడలేదు. తొలి అరగంట మరీ మందకొడిగా నీరసమైన మ్యూజిక్ తో సాగింది. అన్నేసి పాత్రల్ని పరిచయం చేయడానికే ఆ టైమంతా సరిపోయింది. కీలకమైన సన్నివేశాలు కూడా పేలవంగా అనిపించాయంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనిచెయ్యకపోవడమే. ఒక్కపాట కూడా హాంటింగ్ గా లేదు. ఆరెక్స్ 100 హిట్ సినిమాయే కాదు మ్యూజికల్ హిట్ కూడా. మళ్లీ అదే దర్శకుడు, సంగీత దర్శకుడు కలిసి ఆ వండర్ ని రిపీట్ చేయలేకపోయారు. 

ఇక హీరోయిన్స్ విషయానికొస్తే, ప్రధానంగా కథంతా అదితి రావు మీదే నడిచింది. అను ఇమాన్యువల్ ఆటలో అరటిపండులా ఉంది. ఆమెని లా స్టుడెంట్ గా పరిచయం చేసి తరవాత బిజీ లాయర్ గా చూపిస్తే ఆమె కథలో ఎదో మలుపు తిప్పుతుందేమో అన్న అనుమానం కలుగుతుంది. కానీ ఆ నమ్మకాన్ని నిజం చేయకుండా ఆమె పాత్ర నిరుపయోగంగా నిష్క్రమిస్తుంది. 

అజయ్ సినిమా అనగానే హీరోయిన్ గ్లామర్ సైడ్ ని చూపించాలని కాబోలు... అప్పటి వరకు నడిచే కథకి ఒక సడెన్ ట్విస్ట్ ఇచ్చి పాట పెట్టేశారు. అంత గంభీరంగా కనిపించే హీరోయిన్ ఒక ప్రవచనకారుడి దెబ్బకి మనసు మార్చేసుకుని పాటలో పైట జార్చేసుకోవడం చూస్తే భారంగా నిట్టూర్చాల్సొస్తుంది. 

ధనంజయ్ పాత్రలో కెజీఎఫ్ ఫేం రామచంద్రరాజు చాలా పవర్ఫుల్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి చాలా ఈజీగా పోతాడు. గూని బాబ్జీగా రావురమేష్ మీద మాత్రమే నాలుగైదు డయలాగులు పేలాయి. మిగతా పాత్రలేవీ ఆ స్థాయి ఇంపాక్ట్ ని చూపవు. జగపతిబాబు చేసిన వేల్యూ ఎడిషన్ కూడా పెద్దగా లేదు. 

కాగితం మీద రాసుకుని బాగుందనుకున్న కథ తెర మీదకి ఎక్కే సరికి తేడా కొట్టడం చాలా సహజం. ఎంతో పకడ్బందీగా, అత్యంత శ్రద్ధతో చెక్కితే తప్ప ఫలితాలు ఆశాజనకంగా రావు. చాలా అంశాలు టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసినట్టు తెలుస్తూనే ఉంటుంది. శర్వానంద్ డాన్ గా ఎదిగే క్రమాన్ని కూడా మాంటేజస్ లో పేలవంగా నడిపాడు. పెద్ద హీరోలతో సినిమాలు తీసే అవకాశం అజయ్ భూపతికి తొలి సినిమా విజయంతోనే వచ్చేసింది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తనదే. 

సముద్రం ఇంకదు. ఈ మహాసముద్రం కూడా ప్రేక్షకుల మనసులో ఇంకదు. ఆ రకంగా టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది తప్ప, దర్శకుడు చెప్పినట్టు కొలవలేనంత ప్రేమ ఇందులో ఏమీ కనపడదు. 

బాటం లైన్: కెరటాలు లేని సముద్రం

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×