ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా….టీడీపీ చావుకు ‘మా’ గొడవలు కారణమయ్యేలా ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో చోటు చేసుకుంటున్న గొడవలు తెలుగుదేశం పార్టీని భయపెడుతున్నాయి. ‘మా’ పరిణామాలను టీడీపీ క్షుణ్ణంగా గమనిస్తోంది. ‘మా’ గొడవలు రాజకీయంగా తమకెక్కడ నష్టం చేస్తాయోనన్న భయాందోళన టీడీపీలో బలంగా ఉంది. ఎందుకంటే ‘మా’లో పెత్తనం తమదేనని కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోతుండడాన్ని కాపులు జీర్ణించుకోలేన్నారు.
‘మా’లో కమ్మ, కాపు సామాజిక వర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు టాలీవుడ్లో అన్ని రంగాల్లో బలంగా తిష్ట వేశాయి. మిగిలిన సామాజిక వర్గాల వాళ్లు కేవలం అదనపు క్యారెక్టర్స్ కింద లెక్క. దీంతో టాలీవుడ్ అంటే కాపు, కమ్మ అనే రీతిలో వ్యవహారం తయారైంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగా మద్దతు పలికారు. దీంతో ఆయనకు కాపులు వెన్నుదన్నుగా నిలిచినట్టైంది. మరోవైపు మంచు విష్ణుకు కమ్మ సామాజికవర్గమంతా మద్దతుగా నిలిచిందనేది బహరంగ రహస్యమే. దీంతో ‘మా’ ఎన్నికలు కాస్తా కాపు వర్సెస్ కమ్మ అనేలా క్రియేట్ అయ్యాయి.
మంచు విష్ణు గెలుపొందడంపై రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాపుల్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చి తమకు రాజకీయంగా లాభిస్తుందని టీడీపీ సంబర పడుతోంది. అయితే టీడీపీ ఆశలపై ‘మా’ నీళ్లు గుమ్మరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తు న్నాయి.
‘మా’లో అన్ని రకాల మోసాలకు పాల్పడి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి అంత సీన్ లేదని నిరూపించడానికి కుట్ర జరిగిందనే భావన కాపుల్లో బలంగా నాటుకుంది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కాపు యువత రగిలిపోతున్నట్టు వాళ్ల సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఇది రాజకీయంగా టీడీపీపై ప్రభావం చూపుతోంది.
రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు అధికారాన్ని నిలుపుకోవడానికి ఏకమవుతాయని, ఇదే అత్యధిక జనాభా ఉన్న కాపులంతా ఎందుకు ఒక్కటి కాలేకున్నారనే ప్రశ్నలు జనసేన సోషల్ మీడియాలో వెల్లువెత్తడం తాజా మార్పునకు సంకేతమని చెప్పొచ్చు. చివరికి ‘మా’లో మెగాఫ్యామిలీ లేకుండా చేయాలనే కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ముఖ్యంగా కాపు యువత ఆగ్రహంగా ఉంది.
ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి బయటికొచ్చేలా చేశారనే ఆవేదన వాళ్లలో కనిపిస్తోంది. దీంతో తమ ఓట్లను తామే వేసుకుని నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలనే పట్టుదల కాపుల్లో కనిపిస్తోంది.
కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల అధికార పల్లకీలు మోయడానికి మాత్రమే తమతో మంచిగా ఉంటారని, అంతే తప్ప ప్రేమా భిమానాలతో కాదని వాళ్లు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ధోరణే టీడీపీలో వణుకు పుట్టిస్తోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల నాటికి బలపడే అవకాశాలున్నాయి.
జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శల నేపథ్యంలో తమకు లాభిస్తుందని వేసుకున్న అంచనాలు తలకిందులవుతాయనే భయం టీడీపీని పట్టుకుంది.