పవన్‌ని చూసుకుని రెచ్చిపోతే ఎదురుదెబ్బలే!

నిజానికి అది ఇళ్ల కూల్చివేత కూడా కాదు.. వారి ప్రహరీలను ఇళ్లలో కొంత భాగాలను రోడ్డు విస్తరణ కోసం తొలగించిన వైనం మాత్రమే. అది కూడా నూటికి నూరుశాతం నిబంధనల ప్రకారమే చేపట్టారు. ఇలాంటి…

నిజానికి అది ఇళ్ల కూల్చివేత కూడా కాదు.. వారి ప్రహరీలను ఇళ్లలో కొంత భాగాలను రోడ్డు విస్తరణ కోసం తొలగించిన వైనం మాత్రమే. అది కూడా నూటికి నూరుశాతం నిబంధనల ప్రకారమే చేపట్టారు. ఇలాంటి పాక్షిక కూల్చివేతలు అనేవి.. రాష్ట్రంలో ప్రతిచోటా జరుగుతుంటాయి. చిన్నాపెద్దా పట్టణాలు నగరాల్లో కూడా జరుగుతుంటాయి.

ఇప్పటం అమరావతిలో భాగంగా మారుతోంది గనుక.. అక్కడ కూడా రోడ్ల విస్తరణ అనేది ఒక ప్రాథమిక అవసరం గనుక జరిగింది. ఇదేమీ అరాచకం కానే కాదు. ఎందుకంటే.. కూల్చివేతలకు చాలా కాలం ముందుగానే వారికి నోటీసులు ఇచ్చారు. అయితే కూల్చివేతలు మొదలు కాగానే ఆ గ్రామ ప్రజలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అసలే వారు చేస్తున్నది అతి.. దానికి, అత్యంత అతికి పేరు మోసిన పవన్ కల్యాణ్ కూడా తోడయ్యాడు.

ఇక పవన్ తమ వెనుక ఉండి నడిపిస్తున్నాడు కదా అనే భ్రమలో రెచ్చిపోయిన గ్రామస్తులు ఎగిరెగిరి పడ్డారు. కోర్టుకు వెళ్లారు. అక్కడ అబద్ధాలు చెప్పారు. నిజాలను దాచారు. కానీ చివరికి ఏమవుతుంది..? నిజాలు దాచి కోర్టును మోసం చేసే ప్రయత్నం చేస్తారా.. అంటూ న్యాయపీఠం ఆగ్రహించింది. అందరికీ తలా లక్షవంతున జరిమానాలు కూడా విధించింది. 

అనేక ప్రాంతాల్లో జరిగేలాగానే, రోడ్డు విస్తరణకోసం నిర్మాణాలను కూల్చవేయడం అనేది ఇప్పటం గ్రామంలో కూడా జరిగింది. ఆ విషయం అలాగే ముగిసిపోయి ఉండేది కూడా. అయితే మధ్యలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చి.. తను సభ పెట్టుకోడానికి ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలను ఇచ్చినందువల్లనే ప్రభుత్వం కక్ష కట్టి వారి ఇళ్లను కూల్చవేసినదంటూ కాస్త అతి డైలాగులు వల్లించారు. ఆగ్రామాన్ని సందర్శించి హైడ్రామా నడిపించారు. వారికి ఆర్థిక సాయం అందించారు.

ప్రభుత్వం చాలా పద్ధతిగా నోటీసులు ఇచ్చిన చాలా కాలానికి కూల్చివేతలు చేపట్టినా కూడా.. రెచ్చిపోయిన ఇప్పటం వాసులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ప్రభుత్వం ముందే నోటీసులు ఇచ్చిన సంగతి దాచిపెట్టారు. తొలుత స్టే ఇచ్చేసిన ధర్మాసనం.. తర్వాత విచారణలో నోటీసుల సంగతి తెలియడంతో.. కోర్టునుంచి నిజాల్ని దాచినందుకు ఆగ్రహించి.. 13 మంది పిటిషనర్లకు తలా లక్ష వంతున జరిమానా విధించింది.

సింగిల్ జడ్జి తీర్పు సరి కాదంటూ.. దీనిపై వారు అప్పీలుకు వెళ్లారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. జరిమానా కరక్టే అని తేల్చేసింది. మామూలుగా అయితే.. పద్ధతిగా నోటీసులు- తర్వాత కూల్చివేతలు జరిగిన నేపథ్యంలో అందరూ సైలెంట్ గా ఉండేవారే.. మధ్యలో పవన్ కల్యాణ్ చొరబడి.. ఓవరాక్షన్ చేసి.. నా సభకు భూములివ్వడం వల్లనే కూల్చేసారంటూ పురెక్కించినందువల్లనే.. వారు కోర్టుకు వెళ్లి భంగపాటుకు గురయ్యారని ప్రజలు అనుకుంటున్నారు. 

ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు చేపడితే.. రెచ్చిపోయిన పవన్ కల్యాణ్ వారందరికీ తను ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు.. పవన్ మాటలు విని రెచ్చిపోయి వారంతా హైకోర్టుకు వెళ్లి జరిమానా వేయించుకున్నారు. ఆ జరిమానాలను కూడా పవన్ కల్యాణ్  కట్టేస్తేనే సబబుగా ఉంటుంది. ఇప్పటం గ్రామస్తులకు పూర్తిస్థాయిలో ఆయన న్యాయం చేసినట్టు అవుతుంది.