నటుడు పృధ్వీరాజ్ కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని, కానీ టెస్టుల్లో కోవిడ్ నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారాయన. ఎందుకైనా మంచిదని వైద్యుల సూచన మేరకు హాస్పిటల్ జాయిన్ అయ్యారు.
“కొన్ని రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో, అనారోగ్యంతో బాధపడుతున్నాను. అన్ని పరీక్షలు చేయించాను. కొన్ని చోట్ల కరోనా నెగెటివ్ అన్నారు, సీటీ స్కాన్ కూడా చేయించాను. వైద్యులు మాత్రం ఎందుకైనా మంచిదని 15 రోజులు క్వారంటైన్ కేంద్రంలో జాయిన్ అవ్వమన్నారు. నిన్న అర్థరాత్రి జాయిన్ అయ్యాను.”
ఇలా తన ప్రస్తుతం ఆరోగ్య స్థితిని వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు పృధ్విరాజ్. వీడియోలో ఆయన ఆక్సిజన్ ట్యూబ్ తో కనిపించారు. శ్వాస తీసుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు పృధ్వీరాజ్. వైసీపీలో ఆయన కొనసాగుతున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న పృధ్విరాజ్.. ఇప్పుడు హాస్పిటల్ లో చేరారు. దేవుడి దయవల్ల తను పూర్తి ఆరోగ్యంతో మళ్లీ బయటకొస్తానంటున్నారు ఈ నటుడు.