సంక్రాంతి డేట్ లు.. అసలేం జరిగింది?

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకటే తేదీకి విడుదలవుతున్నాయి. ఏం జరిగింది. రెండు సినిమాలతో సంబంధం వున్న నిర్మాత, బయ్యర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు ఈ విషయంలో ఎందుకు ఏమీ చేయలేకపోయారు? అసలు విషయం…

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకటే తేదీకి విడుదలవుతున్నాయి. ఏం జరిగింది. రెండు సినిమాలతో సంబంధం వున్న నిర్మాత, బయ్యర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు ఈ విషయంలో ఎందుకు ఏమీ చేయలేకపోయారు? అసలు విషయం ఏమిటి? సిండికేట్, గిల్డ్, ఇలా రకరకాలుగా ఏదో విధంగా కలిసివుండే సర్దుబాట్లు చేస్తున్న సమయంలో ఎందుకు సాధ్యంకాలేదు?

వాస్తవానికి ఈ విషయంలో సరిలేరునీకెవ్వరు యూనిట్ దే కాస్త తప్పు అని చెప్పకతప్పదు. ఎందుకంటే హారిక హాసిని సంస్థ తన సినిమా అలవైకుంఠపురంలో సినిమాను మహేష్ సినిమాకు ఒకరోజు వెనుకగా వేసుకోవాలని ముందుగానే డిసైడ్ అయింది. ఆ విషయమే తమకు కీలక బయ్యర్ అయిన దిల్ రాజుకు తెలియచేసింది. దిల్ రాజు కూడా మహేష్ బాబు సినిమాలో భాగస్వామి కనుక ముందుగా చెప్పినట్లు అవుతుందని అలా చేసారు.

ఈ విషయాన్ని దిల్ రాజు మహేష్ దృష్టికి తీసుకువచ్చారు. కానీ మహేష్ వేరే ప్రతిపాదన వెనక్కు పంపించారు. తాము 11న వస్తామని, మూడురోజులు గ్యాప్ ఇచ్చి 14న అల వైకుంఠపురములో విడుదల చేసుకోవాలన్నది మహేష్ పంపిన ప్రతిపాదన, కానీ దీనికి హారిక హాసిని సంస్థ అంగీకరించలేదు. ఎందుకంటే 14న వస్తే, ముందు కీలకమైన రెండురోజుల ఓపెనింగ్ పోతుందన్నది వారి వాదన.

ఆంధ్రలో పండగకు జస్ట్ రెండురోజుల ముందే సినిమాల హడావుడి మొదలవుతుంది. అందువల్ల 12నే వస్తామని, ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇవ్వడం సాధ్యమని దిల్ రాజు ద్వారా మళ్లీ కబురు వెళ్లింది. దాంతో తన మాటకు నో చెప్పారని మహేష్ హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆ గ్యాప్ కూడా అనవసరం. వాళ్లేరోజు వస్తారో, అదే రోజు డేట్ వేసేయండి అని కరాఖండిగా చెప్పేసారని బోగట్టా.

ఈ విషయంలో దిల్ రాజు రెండువైపులా సర్దుబాటుచేద్దామనుకున్నారు కానీ సాధ్యంకాలేదు. దాంతో డిసెంబర్ మధ్యలోకి వచ్చాక చూద్దాం అని అలా పక్కనపెట్టారు. కానీ ఇంతలో మధ్యలోకి వెంకీమామ వ్యవహారం దూరింది. నిర్మాత సురేష్ బాబు, చాలా సైలంట్ గా తన మేనేజర్లను హైదరాబాద్ రప్పించి, మీటింగ్ పెట్టి, పండుగకు వస్తే ఎలా వుంటుంది? మనమే ముందుగా 12న అనౌన్స్ చేస్తే ఎలా వుంటుంది అన్నది ఆరా తీసారు.

ఇదికాస్తా డిస్ట్రిబ్యూటర్ సర్కిళ్ల ద్వారా వెంటనే బయటకు పొక్కేసింది. ముఖ్యంగా సురేష్ బాబుతో వ్యాపార బంధాలు వున్న ఓ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ కొందరికి ఈ విషయం చేరవేసారు. దాంతో వున్నట్లుండి పదే పది నిమిషాల్లో డిజైన్ చేయించి, అల వైకుంఠపురంలో 12న విడుదల అని ప్రకటించేసారు. ఇదిచూసి మహేష్ బాబు కూడా డెసిషన్ తీసుకుని డేట్ వదిలేసారు. ఈ విషయంలో మహేష్ బాబే పంతానికి పోయారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆయన సినిమా 11న అన్నపుడు బన్నీ సినిమా 11న అని అనలేదని, ఓ రోజు ఆలస్యంగానే వస్తామన్నారని ఇక సమస్య ఏమిటి అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. మహేష్ చెప్పినట్లు లేదా అడిగినట్లు మూడురోజులు గ్యాప్ ఇచ్చేసివుంటే మంచిదా? ఇవ్వకపోతే కావాలని అదే డేట్ కు వేస్తారా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హీరోలు బాగానే వుంటారని, నిర్మాతలు, బయ్యర్లకే సమస్య అని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రెండు సినిమాలు కూడా దాదాపు ఒకే రేంజ్ లో విక్రయిస్తారు. సోలోగా వస్తేనే, ఆంధ్రలో ఈ రేంజ్ హీరోల సినిమాలు 40 కోట్ల మేరకు చేసి బయ్యర్లు గట్టెక్కడం కష్టం అవుతోంది. గతంలో కొన్ని సినిమాలు ఈ విషయం నిరూపించాయి. అతి కష్టం మీద కొన్ని ఏరియాల బ్రేక్ ఈవెన్ కావడం, కొన్ని కాకపోవడం, తమ బయ్యర్ల ద్వారా ఏదో అంకెలు రప్పించి, అయింది అనిపించుకోవడం కామన్ అయింది.

ఇలాంటి నేపథ్యంలో నాలుగు సినిమాలు పోటా పోటీ అంటే వసూళ్లు ఎలా వుంటాయో అని బయ్యర్లు జంకుతున్నారు. అయితే రెండు సినిమాలకు దాదాపు ఫిక్స్ బయ్యర్లు వున్నారు. అమ్మకం ఎలావున్నా, అడ్వాన్స్ లు వచ్చేస్తాయి. అందువల్ల సమస్య లేదు. కానీ  తీరా బ్రేక్ ఈవెన్ కాకుంటేనే నిర్మాతలకు సమస్య.

అయితే ఒకటే ధీమా. పండగ సీజన్. అదనపు ఆటలు, అదనపు రేట్లు. ఇటీవల పెద్ద సినిమాలకు కోర్టుల ద్వారా ఇష్టం వచ్చినట్లు రేట్లు తెచ్చుకుంటున్నారు. రెండు వందలు యూనిఫారమ్, మూడు వందలు యూనిఫారమ్ రేట్లు పెట్టేసి, గట్టెక్కేస్తున్నారు. ఇప్పుడు అదే ధీమా వుంటుంది. చూసే జనాలు చూస్తారు.

ఇదిలావుంటే డేట్ ను వదిలేముందు మహేష్ బాబు ఈ విషయంలో దిల్ రాజుతో కూడా మరి ప్రస్తావించలేదని తెలుస్తోంది. దాంతో ఆయన కూడా మౌనం వహించారని బోగట్టా. వాస్తవానికి థియేటర్ల సమస్య లేదు. దిల్ రాజు ముందు జాగ్రత్తగా సినిమా పేరు పెట్టకుండా కావాల్సిన థియేటర్లు అన్నీ అగ్రిమెంట్ చేసేసారు. అయితే రజనీ, లేదా మహేష్, కాకుంటే బన్నీ, ఇలా మూడు సినిమాలకు ప్లాన్డ్ గా సర్దుబాటు చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వెంకీమామ కూడా ఆంధ్రలోని 250 నుంచి 300 థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతోంది. నైజాంలో సురేష్ బాబుకు సమస్యలేదు. అలాగే సీడెడ్ కూడా ఫరవాలేదు. మొత్తంమీద సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రస్తుతానికి. ఇక అయిదో సినిమా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా? సంగతి తెలియాల్సి వుంది.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ