క‌రోనా సోకిన ప్ర‌ముఖులు.. ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కే!

క‌రోనా సోకిన సామాన్యుల‌కు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌క‌ల స‌దుపాయాల‌తో చికిత్స‌ను అందిస్తున్న‌ట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ విష‌యంలో భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. మ‌రి…

క‌రోనా సోకిన సామాన్యుల‌కు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌క‌ల స‌దుపాయాల‌తో చికిత్స‌ను అందిస్తున్న‌ట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ విష‌యంలో భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. మ‌రి కొంద‌రేమో బాగా చూసుకుని, చికిత్స చేశార‌ని అంటున్నారు. ఒక్కో చోట ఒక్కోలా ఉండొచ్చు,  చూసే వాళ్ల దృష్టి మీద కూడా అభిప్రాయాలు ఆధార‌ప‌డి ఉంటాయి. క‌రోనా ఐసొలేష‌న్ వార్డుల్లో ఉన్న వారు ఒంట‌రిత‌నంతో త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోన‌ట్టుగా భావించ‌వ‌చ్చు.  వారికి ధైర్యం చెప్ప‌డానికి వైద్యులు రోజుకు ఒక‌సారి మించి ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌చ్చు. న‌ర్సుల వంటి వారు ఆ వార్డుల వైపు చూడ‌టానికి భ‌య‌ప‌డ‌వ‌చ్చు. ఈ విష‌యంలో ఎవ‌రిని నిందించీ అంత ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎవ‌రికైనా భీతి ఉంటుంది క‌దా?

ఆ సంగ‌త‌లా ఉంటే.. దేశంలో క‌రోనా సోకిన ప్ర‌ముఖులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు వైపు చూస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు, గ‌వ‌ర్న‌ర్ల‌కు, మంత్రుల‌కు, కేంద్ర మంత్రులుకు కూడా క‌రోనా సోకింది. అలాంటి వారంతా ప్రైవేట్ ఆసుప‌త్రుల్లోనే చికిత్స పొందుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఎవ‌రూ అంత ధైర్యంగా ప్ర‌భుత్వాసుప‌త్రుల వైపు చూడన‌ట్టున్నారు. సామాన్యుల‌కు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో అన్ని సౌక‌ర్యాల‌నూ ఏర్పాటు చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించిన నేత‌లు తాము మాత్రం ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో చేరిన వైనం ఇలా ఉంది.

-క‌ర్ణాట‌క సీఎం య‌డియూర‌ప్ప బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ ఆసుప‌త్రిలో చేరారు. త‌ను క‌రోనా పాజిటివ్ గా తేలిన విష‌యాన్ని ఆయ‌నే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

-కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గుర్గావ్ లోని ఒక ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌కు అద‌నంగా ప్ర‌భుత్వ ఫండింగ్ తో న‌డిచే ఎయిమ్స్ వైద్యులు కూడా ప్రైవేట్ ఆసుప‌త్రికే వెళ్లి చికిత్స‌ను అందిస్తున్నార‌ని స‌మాచారం.

-త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ అక్క‌డి ప్ర‌ముఖ ప్రైవేట్ ఆసుప‌త్రి కావేరీలో చికిత్స పొందుతున్నార‌ట‌.

-యూపీలో క‌రోనాతో ఒక మ‌హిళా మంత్రి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మాత్రం ప్ర‌భుత్వం చేత నిర్వ‌హించ‌బ‌డే సంజ‌య్ గాంధీ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు పాపం.

-మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక ప్రైవేట్ ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు.

-త‌మిళ‌నాడులో కోవిడ్-19కు పాజిటివ్ గా తేలిన నేత‌లు కూడా అక్క‌డి ప్రైవేట్ ఆసుప‌త్రుల‌నే ఆశ్ర‌యిస్తున్నారు.

ఇలా దేశ వ్యాప్తంగా క‌రోనాకు గురైన రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లోనే చేరుతున్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల వైపు వెళ్ల‌డం లేదు. డ‌బ్బున్న వాళ్లు, క‌రోనా భ‌యాలు, ప్ర‌భుత్వాసుప‌త్రుల‌పై ఏకంగా ప్ర‌భుత్వాధినేత‌ల‌కే న‌మ్మ‌కం లేక‌పోవ‌డం.. ఈ ప‌రిస్థితుల‌కు కార‌ణం అని  వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.