లంచం డబ్బు ‘కక్కించిన’ విజిలెన్స్ అధికారులు

తెలుగులో ప్రాస కోసం ఈ కక్కించడం అనే పదం వాడడం సహజం. అయితే హర్యానాలో లంచం సొమ్మును రాబట్టేందుకు అధికారులు నిజంగానే ఓ వ్యక్తితో కక్కించాల్సి వచ్చింది. Advertisement ఫరిదాబాద్ లోని ఓ పోలీస్…

తెలుగులో ప్రాస కోసం ఈ కక్కించడం అనే పదం వాడడం సహజం. అయితే హర్యానాలో లంచం సొమ్మును రాబట్టేందుకు అధికారులు నిజంగానే ఓ వ్యక్తితో కక్కించాల్సి వచ్చింది.

ఫరిదాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు మహేంద్ర. ఆ పోలీస్ స్టేషన్ లో ఎద్దు దొంగతనానికి సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కోసం శంభునాధ్ అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు మహేంద్ర. లంచం ఇవ్వడానికి అంగీకరించిన శంభు ముందుగా 6వేలు సమర్పించుకున్నాడు.

మిగతా 4వేలు చెల్లించే దగ్గర అడ్డంగా దొరికిపోయాడు మహేంద్ర. మిగతా డబ్బు చెల్లించే ముందు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాడు శంభు. ఎప్పట్లానే పక్కాగా మాటువేశారు అధికారులు. శంభు నుంచి మహేంద్ర తన చేతితో డబ్బు అందుకున్న వెంటనే అదుపులోకి తీసుకోవాలనేది ప్లాన్.

ఇలాంటి కేసులు నిలబడాలంటే ఆ కరెన్సీ నోట్లపై మహేంద్ర వేలిముద్రలు కచ్చితంగా ఉండాలి. ఈ విషయం ఎస్సై అయిన మహేంద్రకు కూడా తెలుసు. అందుకే విజిలెన్స్ అధికారులు తనను చుట్టుముట్టారని గ్రహించిన మరుక్షణం, మహేంద్ర ఆ డబ్బును నోట్లో వేసుకున్నాడు. నమిలి మింగేసే ప్రయత్నం చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, మహేంద్రతో ఆ డబ్బు కక్కించారు. ఈ క్రమంలో కొన్ని నోట్లు చిరిగిపోయాయి. మరికొన్నింటిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని అధికారులు షూట్ చేశారు. అలా మహేంద్ర దొరికిపోయాడు.