వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్నాయి. మరోవైపు షర్మిల ఒంటరి పోరు సాగిస్తున్నారు. ప్రజాదరణ పొందేందుకు షర్మిల అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణలో 3,500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు బరిలో దిగనున్నట్టు షర్మిల అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఈ నెల 16న అక్కడ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని షర్మిల ప్రకటించారు. త్వరలో పాలేరుపై కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. గత కొంత కాలంగా పాలేరు నుంచి షర్మిల పోటీపై చర్చ జరుగుతోంది.
పాలేరులో షర్మిల గెలుపు అవకాశాలపై విస్తృతమైన చర్చకు తెరలేచింది. 1962 నుంచి ఇప్పటి వరకూ 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2004 వరకూ ఇది ఎస్సీ రిజర్వ్‌డ్. 2009 నుంచి జనరల్ అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 11 సార్లు, సీపీఎం రెండు దఫాలు, సీపీఐ, బీఆర్ఎస్ ఒక్కోసారి చొప్పున గెలుపొందాయి. ఇక్కడ 2004లో మాత్రమే టీడీపీ పోటీ చేసింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం, జనతా పార్టీలు ఢీకున్నాయి. 2016 ఉప ఎన్నికలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి పాలయ్యారు.
పాలేరులో వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి వామపక్షాలు పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల అన్నీ ఆలోచించే పాలేరులో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అక్కడ తన తండ్రి వైఎస్సార్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారని ఆమె నమ్ముతున్నారు.
అలాగే అణగారిన వర్గాల ప్రజలు తన తండ్రిపై ప్రేమతో ఆదరిస్తారని షర్మిల విశ్వాసం పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు తన వెంట నడుస్తాయనేది షర్మిల వ్యూహం. ఉన్నంతలో పాలేరే షర్మిలకు సరైన నియోజకవర్గం. మరి ప్రజల మనసులో ఏముందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.