క్ష‌మించే ప్ర‌శ్నే లేద‌న్న ఏపీ హైకోర్టు

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓవ‌రాక్ష‌న్ ఫ‌లితంగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఇప్ప‌టం గ్రామం గురించి అంద‌రికీ తెలిసొచ్చింది. ప‌వ‌న్‌ను నమ్ముకుని, న్యాయ స్థానాన్ని మోస‌గించాల‌నే ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టం పిటిష‌నర్లు దెబ్బ మీద దెబ్బ తినాల్సి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓవ‌రాక్ష‌న్ ఫ‌లితంగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఇప్ప‌టం గ్రామం గురించి అంద‌రికీ తెలిసొచ్చింది. ప‌వ‌న్‌ను నమ్ముకుని, న్యాయ స్థానాన్ని మోస‌గించాల‌నే ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టం పిటిష‌నర్లు దెబ్బ మీద దెబ్బ తినాల్సి వ‌చ్చింది. హైకోర్టు చీవాట్ల‌తో పాటు భారీ జ‌రిమానా విధించాల్సిన దుస్థితి ఎదురైంది. త‌ప్పైంద‌ని వేడుకున్నా న్యాయ స్థానం ద‌య చూప‌లేదు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్ర‌శ్నే లేద‌ని కోర్టు ఘాటు వ్యాఖ్య చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష జ‌రిమానా విధింపును స‌వాల్ చేస్తూ ఇప్ప‌టం పిటిష‌న‌ర్లు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ ఆ రిట్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టి వేయ‌డంతో పాటు మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌ల‌తో త‌లంటింది. ఇప్ప‌టంలో అక్ర‌మ నిర్మాణాలు తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఈ మేర‌కు గ్రామ‌స్తుల‌కు ప్ర‌భుత్వం ఈ ఏడాది మే 10న‌ నోటీసులు ఇచ్చింది. ఇప్పటం గ్రామంలోని రామాలయవీధి రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇళ్లను  కూల్చివేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటనారాయణ, మరో 13 మంది గ‌త‌ నెల 4న అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.  

మే 21న ఇచ్చిన నోటీసుల ఆధారంగా చేప‌ట్టిన‌ కూల్చివేతలు నిలిపివేయాలని న్యాయ‌మూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత  జరిగిన విచారణలో న్యాయ స్థానాన్ని పిటిష‌న‌ర్లు మోస‌గించార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లకు మే 10నే షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన  ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని దాచి పెట్టి  మధ్యంతర ఉత్తర్వులు పొందారని తెలిపారు. షోకాజ్‌ నోటీసులు అందుకున్న మాట వాస్తవమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు.

కోర్టును మోసగించ‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న సింగిల్ బెంచ్  14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లకు తెలియక తప్పు చేశారని న్యాయ‌వాది ధర్మాసానికి తెలిపారు.

వాళ్లకు తెలియకపోతే స‌రే, మీరు చదువుకున్నారు క‌దా, అన్నీ తెలిసి మోస‌గిస్తారా? అంటూ  పిటిషన‌ర్ల‌ తరఫున న్యాయవాదిని హైకోర్టు నిల‌దీసింది. ఇలాంటి ధోర‌ణిని ఎప్ప‌టికీ క్ష‌మించేది లేద‌ని హెచ్చ‌రించింది. పిటిష‌న‌ర్ల‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఖర్చులు మాత్రమే విధించి వదిలేశామని న్యాయ స్థానం స్పష్టం చేసింది.