అఖిల‌ప్రియ‌కు ప‌రాభ‌వం

మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌కు ప‌రాభ‌వం ఎదురైంది. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ ఇంటి ఎదురుగా బ్యాంక్ ఉద్యోగులు ధ‌ర్నాకు దిగారు. బ్యాంక్ రుణాన్ని చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేత‌బూని నంద్యాల యూనియ‌న్ బ్యాంక్…

మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌కు ప‌రాభ‌వం ఎదురైంది. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ ఇంటి ఎదురుగా బ్యాంక్ ఉద్యోగులు ధ‌ర్నాకు దిగారు. బ్యాంక్ రుణాన్ని చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేత‌బూని నంద్యాల యూనియ‌న్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది అఖిల‌ప్రియ ఇంటి ఎదురుగా ధ‌ర్నాకు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌త్ డెయిరీ కోసంలో గ‌తంలో భూమా నాగిరెడ్డి నంద్యాల ఆంధ్రా బ్యాంక్ నుంచి రుణం తెచ్చుకున్నారు. ష్యూరిటీ కింద త‌మ ఆస్తుల్ని పెట్టారు.

భూమా నాగిరెడ్డి జీవించినంత కాలం ప్ర‌తి నెలా రుణాన్ని బ్యాంక్‌కు చెల్లించేవారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం అఖిల‌ప్రియ ప‌ట్టించు కోలేదు. ఇప్పుడా మొత్తం రుణం దాదాపు రూ.16 కోట్లు అయ్యింది. ష్యూరిటీ కింద పెట్టిన ఆస్తుల విలువ రూ.80 కోట్లు. బ్యాంక్‌ల విలీనం నేప‌థ్యంలో యూనియ‌న్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం అయ్యింది. తాజాగా అఖిల‌ప్రియ నుంచి రుణాన్ని రిక‌వ‌రీ చేయ‌డానికి యూనియ‌న్ బ్యాంక్ అధికారుల త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చిన‌ట్టుగా వుంది.

ఈ నేప‌థ్యంలో ప‌లు ద‌ఫాలు రుణం చెల్లించాల‌ని యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అఖిల‌ప్రియ‌కు నోటీసులు ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో బ్యాంక్ అధికారులు విసిగిపోయి ఇవాళ మ‌ధ్యాహ్నం ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ ఇంటి ఎదురుగా ఆందోళ‌న‌కు దిగాల్సి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అఖిల‌ప్రియ‌కు హిత‌వు చెబుతూ ప్ల‌కార్డుల‌పై నినాదాలు రాయ‌డం గ‌మ‌నార్హం.

మా బ్యాంక్ బ‌కాయిల‌ను తిరిగి చెల్లించండి- ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు స‌హాయం చేయండి, బ్యాంక్ మ‌నీ ప‌బ్లిక్ మ‌నీ; మా బ‌కాయిల‌ను చెల్లించండి స‌గ‌ర్వంగా జీవించండి త‌దిత‌ర నినాదాల‌తో కూడిన ప్లకార్డులు ప‌ట్టుకుని మాజీ మంత్రి ఇంటి ఎదురుగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌రువు పోతుంద‌ని భావించిన అఖిల‌ప్రియ బ్యాంక్ అధికారుల‌ను ఇంట్లోకి పిలిపించుకుని కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని వేడుకున్న‌ట్టు స‌మాచారం. అఖిల‌ప్రియ వైఖ‌రిపై టీడీపీ అధిష్టానం అస‌హ‌నంగా ఉన్న‌ట్టు స‌మాచారం.